News

nalgonda electricity bill, Nalgonda Bill రేకుల ఇళ్లకు 20 రోజులకే రూ. 1.75 లక్షల కరెంటు బిల్లు.. ఇల్లు అమ్మినా కట్టలేమన్న యజమాని – two bulbs and fan of two petel houses get rs 1.75 lakh electricity bill in nalgonda


రెండు చిన్న గదులుండే రేకుల ఇంటికి నెలకు కరెంటు బిల్లు ఎంత ఎక్కువ వాడినా రూ.200 దాటదు. అలాంటిది తమ ఇళ్లకు వేలల్లో కరెంటు బిల్లు రావడంతో లబ్దిదారులు షాకయ్యారు. రెండు ఇళ్లకు ఏకంగా రూ.1,75,706ల కరెంట్‌ బిల్లు వచ్చిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చింతపల్లి గ్రామంలో నల్లవెళ్లి పుల్లయ్య, నల్లవెళ్లి నిరంజన్‌లకు గత నెల 16 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 20 రోజుల రీడింగ్‌ను తీశారు. వీరిలో పుల్లయ్య ఇంటికి 8,672 యూనిట్లు రీడింగ్‌ తిరిగినట్లు రూ.87,338 బిల్లు వేశారు.

నిరంజన్‌ ఇంటికి 20 రోజులకు 8,793 యూనిట్లు తిరిగినట్లు రీడింగ్ నమోదుకావడంతో రూ.88,368 బిల్లు వేశారు. అయితే, రెండు గదులు ఉండే తమ ఇంటిలో కేవలం రెండు బల్బులు, ఒక ఫ్యాన్‌ ఉంటే రూ.వేలల్లో బిల్లులు ఎలా వచ్చాయని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దళితులమని ప్రభుత్వం తమకు ఉచిత విద్యుత్ ఇస్తే.. ఇంత మొత్తంలో ఎలా వేస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఉచిత విద్యుత్తు అనే కారణంతో ఏళ్లుగా రీడింగ్‌ తీయని అధికారులు.. ఇప్పుడు రీడింగ్ నమోదుచేసి బిల్లు చెల్లించమనం ఏంటి? అని మండిపడుతున్నారు.

పుల్లయ్య కొడుకు సైదులు మాట్లాడుతూ.. మా ఇల్లు అమ్మినా ఈ కరెంట్ బిల్లు కట్టలేమని వాపోయారు. అధికారులను దీని గురించి అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని అన్నారు. ఇంత బిల్లు రావడంతో ఏం చేయాలో మాకు తోచడం లేదన్నారు. ఈ అంశంపై విద్యుత్ శాఖ స్థానిక ఏఈ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. గతంలో పని చేసిన సిబ్బంది నెలనెలా రీడింగ్‌ తీయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Related Articles

Back to top button