News

munugode counting, Munugode Results: మొనగాడెవరో? మునిగేదెవరో? తేలేది ఆ తర్వాతే.. – munugode byelection results today


Munugode Results: తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి తుది ఘట్టం నేడు జరగనుంది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. తెలంగాణలో రంజుగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో మొనగాడెవరో.. మునిగేదెవరో మరికొద్ది గంటల్లోనే తేలనుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరినూ నెలకొన్న క్రమంలో కౌంటింగ్ కోసం రాజకీయ వర్గాలతో పాటు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్‌లు భారీ ఎత్తున జరుగుతోన్నాయి.

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం 7.30 గంటలకు ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంలు ఓపెన్ చేస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం వెలువడే అవకాశముందని తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్ల ఏర్పాటు చేయగా… 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

ప్రతి రౌండ్‌లో ర్యాండమ్‌గా 2 ఈవీఎంలను రిజల్ట్ షీట్‌తో చెకింగ్ చేయనున్నారు. అలాగే ర్యాండమ్‌గా 5 వీవీప్యాట్‌లలోని స్లిప్పులు లెక్కిస్తారు. మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలవ్వగా.. ఓట్ల లెక్కింపు విధుల్లో 250 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. లెక్కింపు కోసం 100 మంది, ఇతర కార్యకలాపాల కోసం 150 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ముందుగా చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు మండలాల ఓట్లు లెక్కించనుండగా.. ఆ తర్వాత గట్టుప్పల్, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. మునుగోడులో ఉపఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. కానీ అధికార టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నడించింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్‌కే వన్ సైడ్‌గా పట్టం కట్టాయి. ఈ సారి ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల ఫలితాలు నిజమై టీఆర్ఎస్‌ విజయ బావుటా ఎగరేస్తుందా? లేక ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

మధ్యాహ్నం ఒంటి గంట కల్లా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశముంది. దీంతో ఆ తర్వాతే తుది ఫలితాలు వచ్చే అవకాశముంది. ఎవరు గెలుస్తారనేది ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని బట్టి తెలియనుంది. కానీ హోరాహోరీగా ఎన్నిక జరగడం, పార్టీల మధ్య నెక్ టూ నెక్ పోటీ ఉండటంతో చివరి వరకు ఉత్కంఠ నెలకొనే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

Back to top button