News

Mumbai Police,Kidnap: సీఈఓ కిడ్నాప్.. సినిమా రేంజ్‌లో పోలీసుల ఛేజ్.. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు – shiv sena mlas son kidnaps music company ceo in mumbai suburb


Kidnap: ఆర్థిక లావాదేవీల్లో గొడవలతో ఓ కంపెనీ సీఈఓను కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టపగలే ఆఫీస్‌లోకి వెళ్లి సీఈఓపై దాడి చేసి.. బలవంతంగా కిడ్నాప్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లి ఎమ్మెల్యే కుమారుడి ముందు ఉంచారు. అక్కడ తుపాకీతో బెదిరించి బలవంతంగా కొన్ని పత్రాల మీద సంతకాలు చేయించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఛేజింగ్ చేసి బాధితుడిని రక్షించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం జరిగిన ఈ కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముంబయి నగర శివారులోని గోరేగావ్‌ ప్రాంతంలో ఉన్న చింతామణి క్లాసిక్‌ కాంప్లెక్స్‌లో ఓ మ్యూజిక్‌ కంపెనీ ఉంది. ఆ కంపెనీ సీఈవో రాజ్‌కుమార్‌ సింగ్‌కు మరో మ్యూజిక్‌ కంపెనీ ఓనర్ మనోజ్‌ మిశ్రాతో గత కొంతకాలంగా డబ్బు లావాదేవీలకు సంబంధించిన గొడవ జరుగుతోంది. దీంతో స్థానిక శిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వే అండతో రాజ్‌కుమార్‌ సింగ్‌పై మనోజ్‌ మిశ్రా బెదిరింపులకు పాల్పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం రాజ్‌కుమార్‌కు.. ఫోన్ చేసిన నిందితులు ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే కార్యాలయానికి రావాలని బెదిరించారు. అయితే ఇప్పుడు రావడం తనకు కుదరదని.. శనివారం వస్తానని రాజ్‌కుమార్ చెప్పి ఫోన్ పెట్టేశాడు.

రాజ్ కుమార్ ఫోన్ పెట్టేసిన కొద్ది సేపటి తర్వాత దాదాపు 10 నుంచి 12 మంది వ్యక్తులు గోరేగావ్‌లోని చింతామణి కాంప్లెక్స్‌లో ఉన్న తన ఆఫీస్‌లోకి చొరబడి అతడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తుపాకీతో బెదిరించి కంపెనీ నుంచి బయటికి తీసుకువచ్చి.. బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది ఒకరు వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారాన్ని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కారు నంబరు గుర్తించి.. నిందితుల కార్లను పట్టుకుని రాజ్‌కుమార్‌ను రక్షించారు. అయితే అప్పటికే నిందితులు కార్లు వదిలేసి పారిపోయినట్లు పేర్కొన్నారు.
అనంతరం బాధితుడి నుంచి పోలీసులు వివరాలను తెలుసుకున్నారు. మొదట తనను కిడ్నాప్‌ చేసి ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లారని రాజ్‌ కుమార్‌ సింగ్‌ పోలీసులకు వివరించారు. అక్కడ ఎమ్మెల్యే కుమారుడు రాజ్‌ సుర్వే తనను బెదిరించి కొన్ని స్టాంప్‌ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. మనోజ్‌ మిశ్రాకు చెందిన ఆదిశక్తి ఫిల్మ్స్‌కు,, రాజ్‌ కుమార్‌ రూ.8 కోట్లు అప్పు ఇచ్చారు. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే.. మనోజ్ మిశ్రా ఇవ్వడం లేదని.. గట్టిగా అడిగితే ఇలా ఎమ్మెల్యే కుమారుడితో కలిసి తనను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజ్ కుమార్ చెప్పారు. దీంతో రాజ్ కుమార్ చేసిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే కుమారుడు రాజ్‌ సుర్వే, మనోజ్‌ మిశ్రాతో పాటు మరో 10 మందిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Lok Sabha: లోక్‌సభలో కేంద్రమంత్రుల బెదిరింపులు .. మొన్న మీనాక్షి లేఖి, నేడు నారాయణ్ రాణే

PM Modi: అందుకే శరద్ పవార్ ప్రధాని కాలేదు.. మోదీ సంచలన వ్యాఖ్యలు
Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button