News

mp raghu rama krishnam raju, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీ మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు.. ఎంపీ రఘురామ – mp raghu rama krishnam raju interesting comments on go number 1 and ap mlc elections result


రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన చేస్తున్న వారిని భయంతో అరెస్టు చేసిన వాళ్లు సింహం ఎలా అవుతారన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. గతంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి, వేధించి హింసించేవారని, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన శాసనసభ్యులపై కూడా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయులుపై దళిత శాసనసభ్యులతోనే దాడి చేయించి.. స్పీకర్ పైనే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు దాడి చేసినట్లుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరు ఎవరిపైన దాడి చేశారనే దానికి ఆధారాలు ఉన్నాయని.. దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నా బయటపెట్టడం లేదన్నారు. అలాగే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 తీర్పు కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. జీవోను వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు.

అక్రమ కేసులో తనని అరెస్టు చేయించి.. చిత్రహింసలకు గురి చేయించి, కొట్టించానని చెప్పుకునే దమ్ము లేని వారు సింహాలా అని ప్రశ్నించారు. తనని కొట్టించడమే కాకుండా, ఆ వీడియోలను ఫోన్లో చూసి ఆనందించారని.. తనకు సంఘీభావం తెలిపిన ఎంపీలకు కొట్టలేదని చెప్పింది నిజం కాదా అన్నారు. కొట్టించి కూడా కొట్టలేదని చెప్పుకునే వాళ్లు సింహం ఎలా అవుతారని ప్రశ్నించారు. కాళ్లు కట్టేసి కొట్టించడం కాదు.. ధైర్యం ఉంటే ఎదురెదురుగా తలపడుదామని, అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని సవాల్ చేశారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు.. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల పరాజయంతో కొంతమంది మంత్రులు ఉలిక్కిపడ్డారన్నారు. 2017లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి నెగ్గితే మార్పు మొదలయ్యిందన్నారని.. ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయిందన్నారు. ఇప్పుడు కూడా ప్రజల్లో మార్పు మొదలయ్యిందని.. పశ్చాత్తాపంతో గ్రాడ్యుయేట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్లు తమ ఓటర్లు కాదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అభిమానులను ఇళ్లల్లో కట్టిపడేసి.. అరవ వాళ్లను అరువుకు తెచ్చుకొని కుప్పం లాంటి చిన్న మున్సిపాలిటీని గెలుచుకున్నారన్నారు. ఆ తర్వాత వై నాట్ 175 అని అన్నారని.. ఇప్పుడు పులివెందులలో పరాజయం తర్వాత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో అత్యధిక సింగిల్ డిజిట్ కోసం అంటే తొమ్మిది స్థానాల కోసం తీవ్రంగా ప్రయత్నించాలన్నారు రఘురామ. అందరిలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మార్పు వస్తుందని.. నిన్నటి వరకు చిటపటలాడిన పార్టీలు కూడా దారిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వామపక్ష పార్టీలతో పాటు, బీజేపీ కార్యకర్తలు సానుభూతిపరులు తమ రెండవ ప్రాధాన్యత ఓటును టీడీపీకే వేశారని.. ప్రజలు పోరాడే వ్యక్తులని గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలలో టీడీపీ సాధించిన విజయాన్ని ప్రజా విజయంగా చంద్రబాబు అభి వర్ణించారన్నారు. చంద్రబాబు తమ పార్టీ నాయకుల మాదిరిగా ఇది తమ విజయం తమ పార్టీ విజయమని చెప్పకుండా ప్రజా విజయంగా అభివర్ణించడం మంచి విషయమన్నారు. ప్రజలు ఈ యుద్ధంలో విజయం సాధించాలంటే సరైన నాయకుడు సైనిక అధ్యక్షుడిగా ఉండాలని.. ప్రజలు అటువంటి నాయకుడిగా చంద్రబాబును గుర్తించారన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేసిన ఓట్లను పబ్లిక్ పల్స్‌గా గుర్తించాలన్నారు. గ్రాడ్యుయేట్ వేసిన ఒక్క ఓటు అతని ఒక్క ఓటు మాత్రమే కాదని.. ఆ కుటుంబ సభ్యుల అందరి ఓటుగా చూడాలన్నారు. ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉన్నారు అనుకుంటే.. ప్రస్తుతం అంచనా వేసిన మూడు శాతం ఓట్లు కాస్త 12% అవుతాయని అన్నారు. ఇక ఒక పార్టీకి మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఒకచోట 3% మరొకచోట 5% ఇంకో చోట 2% ఓట్లు వచ్చినప్పటికీ.. తమకు అన్నీ కలుపుకొని 10% ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పుకోవడం గమ్మత్తుగా ఉందన్నారు. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీకి 150% ఓట్లు వచ్చినట్టా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 స్థానాలున్న టీడీపీ బీసీ మహిళా అభ్యర్థి అనురాధను బరిలోకి దించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా గెలవడానికి కేవలం 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు ఉంటే చాలన్నారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురిని తమతో అధికార పార్టీ నాయకత్వం చేర్చుకుందని.. విలువల గురించి మాట్లాడేవారు పార్టీ వీడి బయటకు వచ్చిన వారిపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. తాను ప్రభుత్వానికి మంచి సూచనలు చేసినందుకే, తనపై అనర్హత వేటు వేయాలని సూట్ కేసుల యుద్ధం చేశారన్నారు. పార్టీ తరఫున ఎవరైనా అభ్యర్థిని నిలబెట్టి విప్ జారీ చేస్తే తాను ఓటు వేస్తానని అన్నారు. అలాగే టీడీపీ తరఫున గెలిచిన నలుగురు ఆ పార్టీ విప్ జారీ చేస్తే ఓటు వేయవద్దంటూ ప్రశ్నించారు. విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసే వారిని అనర్హులుగా ప్రకటిస్తారా అన్నారు. నలుగురు ఓటు వేస్తే, ముగ్గురు వారికి ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఏడు మందిని అనర్హులుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించే దమ్ముందా అని ప్రశ్నించారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button