Mp Avinash Reddy Cbi Notices, సీబీఐ నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి.. ఐదు రోజులు గడువు, ఎందుకంటే! – kadapa mp ys avinash reddy respond on cbi notice
మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనన్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంవల్ల రాలేనని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానన్నారు. అలాగే నోటీసుల్లో ఉన్న సీబీఐ అధికారి ఫోన్ నంబరుకు కాల్ చేసి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం తన నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు ఉన్నాయని.. మరో నాలుగు రోజుల పాటూ బిజీగా ఉంటానని ఎంపీ అంటున్నారు. ఆ తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు రావడానికి సిద్ధమన్నారు.
2019 మార్చి 15న పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హత్య జరగడం రాజకీయంగా కూడా హీట్ పెంచింది. అప్పటి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేయగా.. కొందరు సాక్షుల్ని పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ కేసు ఏపీ హైకోర్టుకు చేరగా.. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసు విచారణ వేగవంతంగా సాగడం లేదని వివేకా కుమార్తె సునీతారెడ్డి (Ys Sunitha Reddy) సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. సునీత పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది.
వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. ఎంపీ అవినాష్‌కు ఇప్పుడు నోటీసులిచ్చింది. దాదాపుగా రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకూ ఒక్కసారీ కూడా ఎంపీని విచారణకు పిలవలేదు. సోమవారం ఉదయం అధికారులు పులివెందులకు వెళ్లారు. అక్కడ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కోసం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అవినాష్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. మరి ఎంపీ అవినాష్ రెడ్డి సమాధానంపై సీబీఐ ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
- Read Latest Andhra Pradesh News and Telugu News