News

Mohit Sharma Best Bowling, మోహిత్ శర్మ ది గేమ్ ఛేంజర్.. 14 బంతులు వేసి 5 వికెట్లు – mohit sharma records best bowling figurs for gt in ipl history


అసలే క్వాలిఫయర్-2 మ్యాచ్. గెలిస్తే ఫైనల్ బెర్తు ఖాయం. ఓడితే మాత్రం నిష్క్రమణ తప్పదు. ఇది ముంబయితో క్వాలిఫయర్-2కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ పరిస్థితి. ఈ సీజన్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన హార్ధిక్ టీం.. క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఫైనల్ వెళ్లాలంటే క్వాలిఫయర్-2లో గెలవడం ఒకటే తమ ముందున్న మార్గం. ఈ పరిస్థితుల్లో ముంబయితో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. పరుగుల వరద పారించింది.

ఓపెనర్ గిల్ ఈ సీజన్‌లో మూడో సెంచరీతో(129, 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ముంబయి ఛేజింగ్‌ సమయంలో 2.2 ఓవర్లలోనే ఓపెనర్లు నేహావ్ వధేరా, రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చి మ్యాచుపై పట్టు సాధించేలా కన్పించింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ బౌండరీలకు చెలరేగిపోవడంతో పరుగుల వరద పారింది. ముంబయి బ్యాటర్ల జోరుతో 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి పోటీలో నిలిచింది.

ముంబయి గెలవాలంటే 36 బంతుల్లో 85 పరుగులు కావాలి. క్రీజులో హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఉండటం, మరో హిట్టర్ టిమ్ డేవిడ్ సైతం బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో మంబయి శిబిరంలో విజయంపై ఆశలు పెరుగుతున్న సమయం అది. సరిగ్గా ఇక్కటే మ్యాచ్ టర్న్ అయింది. ఈ సమయంలో సూర్యను ఔట్ చేస్తేనే విజయావకాశాలు ఉంటాయని భావించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. ఆ బాధ్యతను సీనియర్ బౌలర్ మోహిత్ శర్మకు బంతి అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ తాను వేసిన మూడో బంతికి ప్రమాదకర సూర్యకుమార్ యాదవ్‌ను మోహిత్ శర్మ బౌల్డ్ చేశాడు. దీంతో గుజరాత్‌ టీంను రేసులో తెచ్చాడు. అదే ఓవర్లో విష్ణువినోద్‌ను సైతం పెవిలియన్ బాట పట్టించాడు.

మళ్లీ 17వ ఓవర్లోనూ మరో రెండు వికెట్లు పడగొట్టాడు మోహిత్ శర్మ. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కార్తికేయను ఔట్ చేసి ఈ సీజన్‌లో ముంబయి పోరాటానికి తెరదించాడు. వరుసగా రెండో ఏడాది గుజరాత్ టీం ఫైనల్స్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచులో 14 బంతులు(2.2ఓవర్లు) మాత్రమే బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ.. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. గేమ్ ఛేంజర్‌గా మారాడు. ఐపీఎల్‌లో ఓదశలో కీలక బౌలర్‌గా ఎదిగి.. తర్వాత నెట్ బౌలర్‌గా మారిన మోహిత్ శర్మ.. మళ్లీ తన ప్రతిభతో కుర్రాళ్లతో పోటీపడి సత్తాచాటుతున్నాడు. క్వాలిఫయర్-2 మ్యాచులో ఐదు వికెట్లు పడగొట్టి లీగ్ చరిత్రలో గుజరాత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.
మోహిత్ శర్మ ప్రదర్శన పట్ల మాజీల నుండి సైతం ప్రశంసలు వస్తున్నాయి.

Related Articles

Back to top button