Entertainment

#MenToo Movie Review: సూటిగా చెప్పడంలో తడబడ్డ హ్యాష్‌ట్యాగ్‌ మెన్‌టూ..


Mentoo Review

కొందరు అమ్మాయిలు అరిచి తమకు కావాల్సింది సాధించుకుంటారు. చీటికీమాటికీ కన్నీళ్లు పెట్టుకుంటారు. సొసైటీ కల్పించిన హక్కులను తప్పుగా వాడుకుంటారు. సూడో ఫెమినిస్టులుగా తయారవుతున్నారు… ఇటువంటి పలు విషయాలను ప్రస్తావిస్తూ తెరకెక్కిన సినిమా హ్యాష్‌ట్యాగ్‌ మెన్‌టూ. నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ జి. రెడ్డి దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏమేర ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం..

సినిమా: #మెన్‌టూ

సంస్థ: లాన్‌థ్రెన్‌ క్రియేటివ్‌ వర్క్స్

నటీనటులు: నరేష్‌ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్‌, మౌర్య సిద్ధవరం, కౌశిక్‌ ఘంటసాల, రియా సుమన్‌, ప్రియాంక శర్మ తదితరులు

దర్శకత్వం: శ్రీకాంత్‌ జి.రెడ్డి

డిస్ట్రిబ్యూషన్‌: మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌

కెమెరా: పి.సి.మౌళి

పాటలు, మాటలు: రాకేందు మౌళి

Advertisement

ఆర్ట్: చంద్రమౌళి

నిర్మాత: మౌర్య సిద్ధవరం

విడుదల: మే 26, 2023

చిన్నప్పటి నుంచి సంపదలో పెరిగిన అబ్బాయి సంజు (కౌశిక్‌ ఘంటసాల), గ్రీన్‌ కార్డును వద్దనుకుని నిజమైన ప్రేమను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. అక్కడ అతనికి స్టాండప్‌ కామెడీ చేసే అమ్మాయి తారసపడుతుంది. ఆమెకి యూఎస్‌ వెళ్లాలన్నది కోరిక. దాన్నే పదే పదే ప్రస్తావిస్తుంటుంది. అభిరుచులు వేరైన ఆ ఇద్దరు కలిసి అడుగులు వేశారా? లేదా?… ఇది ఓ కథ

నాలుగేళ్లు చూపులతోనే ఫాతిమాను ప్రేమిస్తుంటాడు మెకానిక్‌ మున్నా(మౌర్య సిద్ధవరం). ఒక రోజు ఫాతిమాకి పెళ్లయిందని తెలిసి అమ్మాయిల మీద విరక్తి పెంచుకుంటాడు. డేటింగ్‌ యాప్‌లో అమ్మాయిలను రిజక్ట్ చేసి హ్యాపీగా ఫీలయ్యే టైప్‌ అతను. అలాంటిది అతనికి ఓ రోజు డేటింగ్‌ యాప్‌లో ఫాతిమా కనిపిస్తే ఎలా ఫీలయ్యాడు… ఇది ఇంకో కథ

చిన్నప్పటి నుంచి సింగిల్‌ మదర్‌ నీడలో పెరిగిన ఆదిత్య (నరేష్‌ అగస్త్య) కి, లవ్‌లైఫ్ లోనూ తనని కేర్‌ టేక్‌ చేసే అమ్మాయి కనిపిస్తే ఎలా రిజీవ్‌ చేసుకున్నాడు? ఆమెకు ఓకే చెప్పాడా? లేకుంటే అందరూ అమ్మాయిలే ఉన్న ఓ ఆఫీసులో కొలువు సంపాదించి తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడా? ఇది మరో కథ.

ఆఫీసులో చేయని నేరానికి ఉద్యోగం పోగొట్టుకున్న ఐఐటీ టాపర్‌ రాహుల్‌ (హర్ష) ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? అతను లైంగికంగా వేధించే వ్యక్తి కాదని, గే అని సొసైటీకి చెప్పడానికి ఎందుకు వెనకడుగు వేశాడు? ఇది కథలో ఎక్కువగా కనిపించే స్టోరీ. వీళ్లందరినీ కలిపిన పబ్‌దీ, అందులో పనిచేసే వెయిటర్‌ (సుదర్శన్‌)దీ, ఆ పబ్‌ ఓనర్‌(బ్రహ్మాజీ)దీ మరో స్టోరీ. చెప్పుకుంటూ పోతే, మెన్‌ టూలో ఇలాంటి కథలకు కొదవే లేదు. ఇంటా, బయటా తమకు కల్పించిన హక్కులను దుర్వినియోగం చేస్తున్న అమ్మాయిలకు సంబంధించిన ఘటనలతో తెరకెక్కించారు.

ఆర్టిస్టుల నటన నేచురల్‌గా ఉంది. నరేష్‌ అగస్త్య సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, కౌశిక్‌ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి. మౌర్య రాయలసీమ యాసలో మాట్లాడిన తీరు, అతని కామెడీ టైమింగ్‌ జనాలను అట్రాక్ట్ చేస్తుంది. ఇన్నాళ్లూ కామెడీ రోల్స్ లో మెప్పించిన హర్ష ఈ సినిమాలో కాస్త వెరైటీగా యాక్ట్ చేశారు. అతని నటనకు మంచి మార్కులే పడతాయి.
సన్నివేశాల పరంగానూ అక్కడక్కడా బాగానే ఉంది హ్యాష్‌ట్యాగ్‌ మెన్‌టూ. అబ్బాయిలకు అబ్బాయిలు సపోర్ట్ చేసుకోవడం లేదు, అమ్మాయిలు తమ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారు వంటి కాన్సెప్టులను బేస్‌ చేసుకుని తీసిన మూవీ కాబట్టి, మళ్లీ మళ్లీ అలాంటి విషయాలనే చెప్పే ప్రయత్నం చేశారు.

కొన్ని సన్నివేశాలను ట్రిమ్‌ చేసుంటే బావుండేది. కెమెరా వర్క్ క్లియర్‌గా ఉంది. ఎడిటర్‌ ఇంకాస్త ల్యాగ్‌లు తగ్గించాల్సింది. మ్యూజిక్‌ స్పాట్‌లో వినడానికి బాగానే ఉన్నట్టు అనిపించినా మళ్లీ మళ్లీ గుర్తుపెట్టుకునేలా లేదు. ఇలాంటి సినిమాలకు మ్యూజిక్‌ సోల్‌ కావాలి. ఈ సినిమాలో అది మిస్‌ అయింది. అమ్మాయిలను ప్రత్యేకించి ఎక్కడా తిట్టిన సీన్లు లేవు. సింగిల్‌ విమెన్‌గా ఓ తల్లి పోరాటం, తల్లిదండ్రులు విడిపోతే ఓ అమ్మాయి తనకు తాను సర్దిచెప్పుకుని పెరిగిన విధానం… అంటూ పాజిటివ్‌ సైడ్‌ కూడా చూపించారు. కాకపోతే పబ్‌ ఓనర్‌ భార్య, ఆఫీస్‌లో కొలీగ్‌ మీద తప్పుడు ఆరోపణలు చేసి, ముసలి కన్నీరు పెట్టుకున్న అమ్మాయి తరహా కేరక్టర్లను మాత్రం సూడో ఫెమినిజాన్ని చెప్పడానికి వాడుకున్నారు. తీసుకున్న సబ్జెక్ట్ ని సూటిగా డీల్‌ చేయడంలో డైరక్టర్‌ ఎక్కడో తడబడ్డట్టే అనిపిస్తుంది.

ఫైనల్‌గా…. సరదాగా చూడాలనుకున్నవారు ఓ సారి చూడొచ్చు

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Related Articles

Back to top button