Ram Charan-RRR: ‘అక్కడ అతిథిగా ఉంటే చాలనుకున్నాను.. కానీ’.. ఆస్కార్‌కు నాటు నాటు సాంగ్ పై చరణ్ కామెంట్స్..

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ట్రిపుల్ ఆర్ యూనిట్ పాల్గొననుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఫుట్ ట్యాపింగ్ గ్లోబల్ చార్ట్ బస్టర్ నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఈ పాటను మార్చి 12న జరగబోయే ఆస్కార్ వేడుకలలో లైవ్ ఫెర్మామెన్స్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం చరణ్ అమెరికా మీడియాతో ఇంట్రాక్ట్ అవుతూ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు చరణ్. తాజాగా కేటీఎల్ఏ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో ఆస్కార్ రేసులో నాటు నాటు సాంగ్ ఉండడంపై చరణ్ తన అభిప్రాయాన్ని తెలియేజేశాడు. “ఓ నటుడిగా అది నాకెంతో సంతృప్తిని కలిగించే క్షణాలు ఇవి. ఆస్కార్ వేడుకల్లో నేను ఓ అతిథిగా ఉంటే చాలనుకున్నాను.. అలాంటిది మా సినిమాలోని పాట నామినేట్ అయ్యిందంటే అంతకుమించి ఏం కావాలి. అవార్డ్ తీసుకుని మా చిత్రబృందంతో కలిసి మా దేశానికి వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
మా ఇండియన్ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమకు 85 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు మీరు మమ్మల్ని గుర్తించారు. మా సినిమా ఎంతో బాగుందని అప్రిషియేట్ చేశారు. నేను వివిధ దేశాల్లో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో మా మార్క్ చూపించటానికి ఇదే సరైన తరుణంగా భావిస్తున్నాం”. అని అన్నారు.