News
meerpet mother kills, మాతృదినోత్సవం రోజున విషాదం.. ఇద్దరు పిల్లలను చంపేసి తల్లి ఆత్మహత్యాయత్నం – mother kills 2 kids, attempts suicide in meerpet hyderabad
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని కుబ్యా తండాకు చెందిన శ్రీనివాస్, భారతి దంపతులకు 2020లో పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరు మీర్‌పేట్ పీఎస్ పరిధిలోని జిల్లెలగూడలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు విక్కీ (18 నెలలు), లక్కీ (8 నెలలు) ఉన్నారు. శనివారం శ్రీనివాస్ తల్లి వీరి ఇంటి వద్దకు రాగా.. దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇవాళ ఉదయం భారతి తల్లిదండ్రులు కూడా శ్రీనివాస్ ఇంటికి రాగా.. మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.
అనంతరం శ్రీనివాస్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన భారతి (26) ఇవాళ సాయంత్రం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్‌లో ముంచి చంపేసింది. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పిల్లల్ని చంపి విషం తాగిన విషయాన్ని స్వయంగా భర్తకు ఫోన్ చేసి చెప్పింది. హుటాహుటిన ఇంటికి చేరుకున్న శ్రీనివాస్.. పిల్లలను, భార్యను దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
భార్య భారతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మాతృదినోత్సం రోజున ఇద్దరు పిల్లను చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.
- Read More Telangana News And Telugu News