News
Medak district, Telangana: బ్రతికుండగానే వ్యక్తిని కారులో ఉంచి నిప్పుపెట్టిన దుండగులు.. చివరికి అలా.. – an incident where a person was burnt alive in a car took place in medak district
టెక్మాల్ మండలం వెంకటపూర్ గ్రామ శివారులో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కారులో సజీవదహనం చేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దహనం కాగా.. మృతుడి ఒక కాలు కాలిపోకుండా కారు డోర్ నుండి బయటపడింది. దీంతో స్థానికులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల సమాచారంతో టెక్మాల్ మండల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దీనిపై కేసు నమోదు చేశారు. మృతిని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.
బలవంతంగా వ్యక్తిని కారులోకి ఎక్కించి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తోన్నారు. కారు నెంబర్ను దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో కట్టపై పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఓ గిరిజన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కారుతో పాటు వ్యక్తిని సజీవదహనం చేసి దుండగులు దారుణ హత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఎవరు ఈ హత్య చేశారు? కారణం ఏంటి? అనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. గ్రామస్తులను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏ సమయంలో ఘటన జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. పోలీసుల విచారణలో ఈ దారుణ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది.