News

Marri Shashidhar Reddy, Telangana: నేడు బీజేపీలోకి ఇద్దరు సీనియర్ నేతలు.. ‘హస్తం’ అస్తవ్యస్తం – marri shashidhar reddy and rama rao patel will join bjp today


Telangana: మాజీ మంత్రి, సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం కమలం గూటికి చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీలో చేరిక సందర్భంగా గురువారం మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయన పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, సీనియర్ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు జరగనున్న మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిక కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొననున్నారు.

మర్రి శశిధర్ రెడ్డితో పాటు నిర్మల్ జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ కూడా జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి గురువారం రాత్రి ఢిల్లీకి రామారావు పటేల్ బయలుదేరారు. శుక్రవారం జేపీ నడ్డాతో భేటీ అనంతరం మర్రి శశిధర్ రెడ్డితో పాటు కలిసి రామారావు పటేల్ కమలం గూటికి చేరుకోనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రామారావు రాజీనామా చేశారు. భైంసాకు చెందిన రామారావు పటేల్.. గత ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.

ఈ సందర్భంగా కేంద్ర బీజేపీ పెద్దలతో రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను బీజేపీ పెద్దలకు వివరించనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర, నేతల చేరికలపై చర్చించే అవకాశముందని కాషాయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన శిక్షణా తరగతులు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఢిల్లీ బీజేపీ అధిష్టానానికి తెలపనున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న వ్యూహలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు లాంటి ఇతర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.

కాగా కీలక నేతలు పార్టీని వీడుతుండటం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుండటంతో రాష్ట్రంలో హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారిపోయింది. పార్టీని వీడుతున్న వారందరూ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా వీడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ మరింత చతికిలపడుతోంది.

Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button