News

Man Travels With son dead body, హృదయవిదారకం.. అంబులెన్స్‌కు డబ్బుల్లేక కొడుకు మృతదేహంతో బస్సులో 200 కి.మీలు ప్రయాణం – unable to pay ambulance man travels 200 km by bus with sons body in bag in west bengal


అనారోగ్యంతో కన్నబిడ్డ కన్నుమూయడంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ (ambulance)కు డబ్బులివ్వలేని ఓ తండ్రి బస్సులో తీసుకొచ్చాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని తన కుమారుడి మృతదేహాన్ని ఎవరికీ కన్పించకుండా బ్యాగులో పెట్టి 200 కి.మీలు ప్రయాణించాడు. హృదయవిదారకమైన ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కలియాగంజ్‌ ప్రాంతానికి చెందిన రోజు కూలీ అసిమ్‌ దేవశర్మ భార్యకు ఐదు నెలల కిందట కవలలు పుట్టారు. ఇద్దరు పిల్లలూ అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం కలియాగంజ్‌ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పిల్లల్ని పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో మెరుగైన వైద్యం కోసం సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడకు తీసుకెళ్లిన తర్వాత కవలల్లో ఒకరి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. దీంతో ఆ బిడ్డను తీసుకుని దేవశర్మ భార్య ఇంటికి వెళ్లిపోయింది. అయితే, మరో చిన్నారి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సిబ్బందిని దేశశర్మ కోరితే.. ఇందుకు రూ.8 వేలు డిమాండ్ చేశారు.

అప్పటికే చికిత్స కోసం తన వద్ద ఉన్న రూ.16 వేలు ఖర్చుచేయడంతో అంబులెన్స్‌కు ఇవ్వడానికి ఏమీ లేవని చెప్పాడు. అయినా సరే అంబులెన్స్ డ్రైవర్ కనీసం జాలి చూపలేదు. చివరకు చేసేదేం లేక చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో ఉంచి 200 కి.మీలు బస్సులో ప్రయాణించాడు. కలియాగంజ్‌ చేరుకున్నాక.. అక్కడి నుంచి అంబులెన్స్‌ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది.

అసిమ్ దేశశర్మ మాట్లాడుతూ… ‘‘చనిపోయిన నా కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటుచేయమని అడిగాను.. 102 పథకం కింద రోగులకు మాత్రం ఉచితమని, మృతదేహాలను తరలించాలంటే డబ్బులివ్వాల్సిందేనని డ్రైవర్ అన్నాడు.. రూ.8వేలు డిమాండ్‌ చేశారు. నా దగ్గర అంతమొత్తం లేకపోవడంతో బస్సులో వచ్చాను.. మృతదేహంతో బస్సు ఎక్కుతుంటే తోటి ప్రయాణికులు, సిబ్బంది కిందకు దించేస్తారేమోనని భయపడి ఎవరికీ తెలియకుండా బ్యాగులో తీసుకొచ్చా’’ అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటనపై బెంగాల్‌లో తీవ్ర రాజకీయంగా దుమారం రేగుతోంది. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి స్పందిస్తూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్వస్థ్య సాథి’ ఆరోగ్య బీమా పథకంపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి బెంగాల్ మోడల్‌ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. అయితే, ఈ విమర్శలను టీఎంసీ తిప్పికొట్టింది. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్ దుయ్యబట్టారు. ఈ ఏడాది జనవరిలోనూ జిల్లాలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది.

Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button