KTR: సిరిసిల్లకు సినిమా వచ్చిందా.. బలగం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కేటీఆర్ సంబరం!! – ktr feels happy in balagam pre release event at sircilla
ఈ వేడుకకు హాజరైన జన సందోహాన్ని చూసి ‘బతుకమ్మ ఘాట్ కళకళాడుతోందా.. సిరిసిల్లకు సినిమాకు వచ్చిందా.. హ్యాపీనా’ అంటూ స్పీచ్ ప్రారంభించారు కేటీఆర్. ముందుగా సిరిసిల్లకు సినిమాను తెచ్చిన దర్శకుడు వేణును హృదయపూర్వకంగా అభినందిస్తూ.. నటుడిగా వేణు తెలుసు కానీ ఇంత అద్భుతంగా సినిమా తీస్తాడని ఊహించలేదన్నారు. కాసర్ల శ్యామ్ పాటలు,
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌ను ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ఇక సినిమా గురించి చెప్తూ.. గుండె లోతుల్లో నుంచి వచ్చిన ఎమోషన్‌ను చక్కగా తెరకెక్కించారని, ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని చెప్పారు.
చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ ఏమీ ఉండవని అభిప్రాయపడ్డ కేటీఆర్.. అప్పుడప్పుడు చిన్న సినిమాలే పెద్ద సినిమాలను ఉప్పెనలా ఊపేస్తాయని తెలిపారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు హన్షిత్, హర్షితను దిల్ రాజు తొక్కేస్తు్న్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే అందరూ దిల్ రాజు గురించే మాట్లాడుతున్నారని.. దాన్ని అధిగమించి వారు కూడా సెపరేట్ ఐడెంటిటీ తెచ్చుకోవాలన్నారు. దిల్ రాజు బ్రాండ్ ఎంట్రీ పాస్ మాత్రమేనని.. సొంత అభిరుచి, ఆలోచనతో సినిమాలు తీసి మీదైన ముద్ర వేసుకోవాలని, నాన్న కంటే ఎక్కువ పేరు సంపాదించుకోవాలని వాళ్లిద్దరికీ సూచించారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు కేటీఆర్. ఎంతగా స్ట్రగుల్స్ పడి ఈ స్టేజ్‌కు చేరుకున్నాడో భీమ్స్ మాట్లాడినపుడు అర్థమైందని.. ఆ ఫీల్ గుండెకు తట్టిందని చెబుతూ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే జ్ఞానపీఠ్ అవార్డ్ అందుకున్న సీ నారాయణరెడ్డి వంటి గొప్ప వ్యక్తులు సిరిసిల్లలోనే పుట్టారని.. మిద్దె రాములు వంటి ఎంతో మంది అజ్ఞాత సూర్యులకు ఈ గడ్డ జన్మనిచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘జాతి రత్నం’ డైరెక్టర్ అనుదీప్ గురించి ప్రస్తావిస్తూ.. ఆ సినిమాను పది ఇరవైసార్లు చూసినట్లు వెల్లడించారు.
మొత్తం మీద రాహుల్, ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టి, సిద్ధు వంటి తెలంగాణ నటులు సినిమాల్లో వెండితెరపై తెలంగాణ భాష మాట్లాడుతుంటే గుండెలు ఉప్పొంగుతున్నాయన్న కేటీఆర్.. ఒకప్పుడు నిరాదరణకు గురైన భాషకు ఇప్పుడు గౌరవం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ విధంగా సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతుందంటే.. అది తెలంగాణ ఉద్యమంతోనే సాధ్యమైందన్నారు. ఇలాంటి సినిమాలకు తమ వంతు సహకారం తప్పకుండా అందిస్తామని హామీనిచ్చారు. మూవీ షూటింగ్స్ కోసం ‘సిరిసిల్ల రాజరాజేశ్వర సాగర్, రంగనాయక సాగర్, కొండ పోచ్మ సాగర్’ వంటి ప్రాంతాలు అనువుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఏదేమైనా తెలంగాణ కళాకారుల ప్రతిభను ఈ సినిమా వెలుగులోకి తెస్తుందని వెల్లడిస్తూ.. బలగం మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
- Read Latest Tollywood Updates and Telugu News