komatireddy venkat reddy, ఉచిత విద్య, రూ.500లకే గ్యాస్.. తెలంగాణ కాంగ్రెస్ వరాలు, ఏకతాటిపైకి వచ్చిన నేతలు – revanth reddy and komatireddy speech in congress party meeting in jadcherla
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని తెలిపిన భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పార్టీ పంచిన అటవీ భూములను కేసీఆర్ గుంజుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో పోడు భూముల పట్టాలను గిరిజనులు తనకు చూపించారని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని.. తాము అధికారంలో రాగానే రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల సవాల్ – ప్రతి సవాల్
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తామని ప్రకటించారు. పాలమూరు జిల్లాలో 14కు 12 స్థానాలను గెలిపిస్తారా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ సవాల్‌ను స్వీకరించారు. పాలమూరులో 14కు 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని తెలిపారు. కార్యకర్తలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
‘తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ, తెలంగాణ వచ్చినా, పాలమూరులో వలసలు ఇంకా ఆగలేదు. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితే.. బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలా? గొర్లు, బర్లు మేపడానికి కాదు, తెలంగాణ తెచ్చుకుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎవరు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు.
‘నల్లమల అడవుల్లో పుట్టిన మీ బిడ్డ పీసీసీ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడటానికి సోనియా గాంధీ అవకాశం ఇచ్చారు. నేను మీరు నాటిన మొక్కను. ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా మీ ముందున్నా. ఇది మిడ్జిల్ మండల, పాలమూరు ప్రజల గొప్పదనం. మీ బిడ్డకు అవకాశం వచ్చింది. ఇది మన ఆత్మగౌరవ సమస్య. పాలమూరు జిల్లా నుంచి 14కు 14 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.