News

Khairatabad Ganesh,ప్రపంచ రికార్డ్‌ సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు! – khairatabad ganesh created a world record as highest eco friendly ganesh idol


హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో గణేష్ చతుర్థి కూడా ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం రెడీ అయింది. నగరంలో బోనాల తర్వాత అత్యంత వైభవంగా జరిగే పండుగ గణేష్ చతుర్థి. దీంతో నగరంలో ఎటు చూసినా గణేష్‌ ఉత్సవ శోభే కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణేషుడు రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు. ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. 45- 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా కొత్త వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అలా.. 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణేషుడిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. హుస్సేన్ సాగర్ మార్గంలో ఆంక్షలు, పర్యావరణ సమస్యలతో ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. గతేడాది 58 అడుగుల ఎత్తులో గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది ప్లాస్టర్‌ ఆఫ్‌ ఫారిస్‌ విగ్రహానికి గుడ్‌ బై చెప్పి.. మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే.. ఈ సారి పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పారు.

ఈసారి విగ్రహం బరువు 45- 50 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఫ్రేమ్ కోసం 22 టన్నుల ఉక్కును ఉపయోగించారు. రాజస్థాన్ నుంచి 40,000 కిలోల మట్టిని ఏపీలోని ఏలూరు నుంచి 40 కిలోల జ్యూట్ పౌడర్ 1000 బస్తాలు, యాదాద్రి నుంచి వరి పొట్టును సేకరించారు. కాసేపట్లో వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహాక్రతువు తొలి పూజను గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి నిర్వహిస్తారు.

Related Articles

Back to top button