Karnataka Corruption,Karnataka CM: ప్రభుత్వం మారినా కర్ణాటకలో ఆగని లంచం ఆరోపణలు.. మంత్రిపై లేఖ వైరల్ – karnataka cm siddaramaiah orders cid probe into bribery charge against agriculture minister chaluvarayaswamy
కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి చెలువరాయస్వామిపై అవినీతి ఆరోపణలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాన్‌గా మారాయి. లంచం కోసం వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి చెలువరాయస్వామి వేధిస్తున్నారనే ఆరోపణలు రాగా వాటికి సంబంధించి కొంతమంది ఉన్నతాధికారులు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ల ద్వారా ప్రతినెలా తలా రూ. 8 లక్షలు లంచం ఇవ్వాలని ఆ శాఖ ఉద్యోగులపై మంత్రి చెలువరాయస్వామి ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి ఆరోపణలపై మండ్య జిల్లా వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు.. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌కు రాసినట్లు ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. అయితే ఆ లేఖను చీఫ్ సెక్రటరీ వందితా శర్మకు పంపించి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి అవినీతి సంప్రదాయాన్ని అడ్డుకోకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యలకు పాల్పడతామని బాధితులు హెచ్చరించడం కొసమెరుపు.
అయితే ఈ మంత్రి అవినీతి లేఖ వ్యవహారం ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఆ లేఖ నకిలీదని పేర్కొన్నారు. బీజేపీ దాని మిత్రపక్షం జేడీఎస్ ఉద్దేశపూర్వకంగా నకిలీ లేఖను సృష్టించి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల చర్య అని భావిస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు కర్ణాటక సీఎంఓ వెల్లడించింది. ఈ నిర్ణయం కంటే ముందే మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అలాంటి లేఖను ఏ అధికారి రాయలేదని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ చెప్పినట్లు తెలిపారు. మరోవైపు.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ఈ అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఒకవేళ ఆ లేఖ నకిలీది అయితే గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఎందుకు స్పందిస్తారని ప్రశ్నలు కురిపించాయి. ఇలా అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రిని ముఖ్మమంత్రి సిద్ధరామయ్య సమర్థించడం మంచిది కాదని విమర్శించాయి.
Read More Latest National News And Telugu News