News

JAGATHGIRIGUTTA, Hyderabad: నడిరోడ్డుపై పరిగెత్తించి.. కత్తులతో వేటాడి.. హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం – two youths chased a youth with knives and killed him in hyderabad


Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. జగద్గీరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని ఇద్దరు యువకులు రోడ్డుపై పరిగెత్తించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

ఆస్బెస్టాస్ కాలనీలో బండెల మనోజ్(22) అనే యువకుడిని సత్తి, మోహన్ అనే ఇద్దరు యువకులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపేశారు. రోడ్డుపై ఉరుకెత్తించి మరీ దారుణంగా హత్య చేశారు. రోడ్డుపై వెళుతున్న వాహదారులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు. ఒక్కరు కూడా ఈ హత్యను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విస్మయాన్ని కల్గిస్తోంది. మనుషుల్లో మానవత్వం లేదని చెప్పడటానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పవచ్చు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మనోజ్‌నుచికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు మనోజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. కనికరం అనేదే లేకుండా నడిరోడ్డుపై కత్తులతో హల్‌చల్ సృష్టిస్తున్నారు కొంతమంది యువకులు. సినిమాలో విలన్ల తరహాలో పరిగెత్తించి హత్య చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నా.. కనీసం ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాకుండా ఇలాంటి దాడి ఘటనలను వీడియోలు తీస్తూ మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోడ్లపై వరుస హత్యలతో నగరవాసులు హడలెత్తిపోతున్నారు.

Related Articles

Back to top button