News

Itlu Mee Niyojakavargam: మంచిర్యాలలో పొలిటికల్‌ మసాలా ఘాటెక్కిందా.. లక్కీ ఎమ్మెల్యేకి మళ్లీ కాలం కలిసొస్తుందా..


Mancherial Constituency

2009లో కొత్తగా మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌, మంచిర్యాల్‌లో బీఆర్‌ఎస్‌ వరుస విజయాలు,
అంతకు ముందు.. మంచిర్యాల , లక్షెట్టిపేట, దండెపల్లి మండలాలతో లక్షేట్టిపేట నియోకవర్గంగా ఉండే ప్రాంతమిది. 2009లో జరిగిన నియోజవర్గాల పునర్విభజనలో.. మంచిర్యాల పేరిట కొత్త అసెంబ్లీ సెగ్మెంట్‌ ఏర్పడింది. సెగ్మెంట్‌ మారడమే కాదు… తదనంతరం రాజకీయాలూ అదేస్థాయిలో మారిపోయాయ్‌ ఇక్కడ. నియోజక ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారిన నాటి టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 2009లో గడ్డం అరవింద్‌రెడ్డి… కాంగ్రెస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుపై గెలిచారు. ఉద్యమ వేడిలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ… ఇక్కడ టీఆర్‌ఎస్‌దే హవా.

అయితే, 2009 నుండి 2014 వరకు నాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన గడ్డం అరవింద్ రెడ్డి… తెలంగాణ సాకారం తర్వాత కాంగ్రెస్‌ గూటికి చేరిపోవడంతో మంచిర్యాల్‌ రాజకీయాలు ఒక్కసారిగా చేంజయ్యాయి. అప్పటిదాకా.. కాంగ్రెస్సే సర్వస్వం అనుకున్న దివాకర్‌రావు… హస్తానికి హ్యాండిచ్చి గులాబీ గూటికి చేరుకున్నారు. అలా పట్టుకున్న పొలిటికల్‌ అదృష్టం… నడిపెల్లి దివాకర్‌రావ్‌ను ఇప్పటికీ విజయాల బాటలో నడిపిస్తోందన్న అభిప్రాయం లోకల్‌గా వినిపిస్తోంది.

మారిన కాంగ్రెస్‌ అభ్యర్థి.. విజయం బీఆర్‌ఎస్‌దే..

2009లో ప్రత్యర్థులు…2014 వచ్చేసరికి రివర్సయ్యారు. కాంగ్రెస్‌ తరపున అర్వింద్‌రెడ్డి… బీఆర్‌ఎస్‌ తరపున నడిపెల్లి దివాకర్ రావు.. బరిలో నిలిచారు. విజయం మాత్రం బీఆర్‌ఎస్‌నే వరించింది. నడిపెల్లి ఏకంగా 59వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా లేనట్టేనన్నమాట. ఇక, 2018కి వచ్చేసరికి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సేమ్‌.. బట్‌ కాంగ్రెస్‌లో క్యాండిడేట్‌ మారిపోయారు. చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావుకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కడంతో… అలకబూనిన గడ్డం అర్వింద్‌రెడ్డి అడ్డం తిరిగారు. వెంటనే కారెక్కేసి… దివాకర్‌రెడ్డికి మరోసారి అదృష్టం కలిసొచ్చేలా చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోరు సాదాసీదా సాగలేదు. హోరాహోరీ తలపడి… లక్కులో 4వేల 848 ఓట్లతో బయటపడ్డారు దివాకర్‌రావు. 5వేల 18 ఓట్లు సాధించిన బీజేపీ… డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో కాంగ్రెస్ పుంజుకున్నా… రాష్ట్ర నాయకత్వం తీరుతో ఇక్కడ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. అయితే, అభ్యర్థిపై ఉన్న సానుభూతి ఈసారి ఎన్నికల్లో హస్తానికి అదృష్టాన్ని కట్టబెడుతుందనే ప్రచారమైతే జరుగుతోంది. షరా మామూలుగానే.. ఈసారి కూడా బీజేపీ పెద్ద ప్రభావం చూపే అవకాశం లేకపోయినా… పోటీ ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచిర్యాలలో ప్రస్తుత పొలిటికల్‌ సిట్యుయేషన్‌ చూస్తే.. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు.

చివరి అవకాశమంటూ సెంటిమెంట్‌

గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎదురైన ఓటమిని.. ఈసారి విజయంగా మార్చుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. అంతర్గతంగా ఎన్ని తగవులున్నా.. తగ్గేదేలె అన్నట్టుగా కార్యక్రమాలు ప్లాన్‌ చేస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్‌ నేత ప్రేంసాగర్‌రావు… రాజకీయంగా తనకిదే చివరి అవకాశం అని భావిస్తున్నారట. ఈసారి విజయం దక్కకపోతే.. ఇక రాజకీయ జీవితం ముగిసినట్టేనని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని సెంటిమెట్‌ అస్త్రంగా ప్రయోగించి గెలిచి తీరాలన్న కసితో ఉన్నారట. అయితే అది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. అటు బీజేపీ నేతలు సైతం… ఒక్కసారి తమకు అవకాశం ఇచ్చి చూడాలని అభ్యర్థిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ మంచిర్యాల్‌లో పార్టీ విస్తరణకు కృషి చేస్తున్నారు.

ఏళ్ల ఏలుబడిలో దివాకర్‌రావు ఏమీ చేయలేదా?

సిట్టింగ్‌ ఎమ్మెల్యే దివాకర్‌రావుపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. నియోజక వర్గానికి చేసిన మేలేమీ లేదన్న అభిప్రాయం లోకల్‌గా వ్యక్తమవుతోంది. మంచిర్యాల నియోజక వర్గం ఏర్పాటుకు ముందు పదేళ్లు.. ఆ తర్వాత ఇప్పుడు 8ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్‌… టౌన్‌ను తప్ప, లోకల్‌ మండలాలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. నాలుగు దపాలుగా ఎమ్మెల్యేగా గెలవడం అదృష్టం వల్లే తప్ప.. మరోటి కాదనేవారూ ఉన్నారు.

బలమైన నాయకుడే అయితే ఇప్పటికే మంత్రిగా చాన్స్‌ కొట్టేసి.. జిల్లాకి ఎంతో సేవ చేసేవారని పెదవి విరుస్తున్నవారూ లేకపోలేదు. అయితే, దివాకర్ రావుకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం లేదనీ.. అందుకే, తనకు కాకపోయినా, తన వారసుడు విజిత్‌ రావుకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యేగా పైకి దివాకర్‌రావే ఉన్నా.. లోలోపల పెత్తనమంతా ఆయన కొడుకు విజిత్‌ రావుదేనన్న ప్రచారం.. ఎలాగో జోరుగా జరుగుతూనే ఉంది.

సిగరేణి ఓట్లే కీలకం… వాళ్ల మనసు గెలిస్తేనే విజయం

నియోజకవర్గంలో ప్రత్యర్థుల బలాబలాల విషయానికి వస్తే బీఆర్ఎస్ , కాంగ్రెస్… నువ్వెంత అంటే నువ్వెంత అన్న రేంజ్‌లో తలపడుతున్నాయ్‌. దండెపల్లి , లక్షెట్టిపేట , మంచిర్యాలలో కాంగ్రెస్ బలంగా ఉంటే… హజీపూర్, నస్పూర్‌లో బీఆర్‌ఎస్‌ ఆదిపత్యం కొనసాగుతోంది. గత రెండు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినా.. మారిన పరిస్థితుల దృష్ట్యా కాషాయ సైన్యం కూడా పోటీనిచ్చేందుకు సిద్దమైంది. ఇక్కడ గెలుపోటములను శాసించేది మాత్రం సింగరేణి కార్మికులే. నస్పూర్ మండలం లోని సింగరేణి ఓట్లను గెల్చుకోవడంలో విఫలమవడం వల్లే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి ఎదురైందనే అభిప్రాయం ఉంది.

Advertisement

సామాజిక వర్గాల వారీగా బీసీ ఓటర్లుగా ఉన్న పెరిక , మున్నూరు కాపులు 42 శాతం ఉన్నారు. వీరిలో 30శాతం మంది సింగరేణి కార్మికులే. సో వీళ్లను ప్రసన్నం చేసుకోగలిగితే.. విజయం సాధించినట్టేనన్నది ఇక్కడి పొలిటికల్‌ ఈక్వెషన్‌. చాలా ఏళ్లుగా… రెడ్డి,వెలమ వర్గాలే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తుండగా… తాజాగా బీసీల ఓట్లు మరో 40వేలు పెరగడంతో.. అధికారపార్టీ రూటుమార్చి బీసీలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈసారి యువత ఓటుశాతం కూడా బాగా పెరిగింది. ఈ పెరిగిన ఓట్లు ఏ పార్టీని గట్టెక్కిస్తాయన్నదే ఆసక్తిరేపుతోంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారమేది?

మచ్చలేని లీడర్‌గా పేరున్నా… దివాకర్‌రావు పనితీరుపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రసర్కారుపైనా కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉండటంతో.. ఎమ్మెల్యే గ్రాఫ్ బాగా పడిపోయినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తై పదిహేనేండ్లు గడుస్తున్నా భూనిర్వాసితులకు ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో పరిహారం దక్కలేదు. తలాపున గోదావరి ఉన్నా నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య పరిష్కారం ఇంకా పరిష్కారం కాలేదు.

వరద ముంపు బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారా?

ఆమధ్య వరదలతో ఏకంగా నియోజక వర్గ కేంద్రంలోని చాలాకాలనీలు నీటమునిగాయ్‌. ఈ నష్టానికి సంబంధించి రైతులకు, ముంపు బాధితులకు పరిహారం ఇప్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న విమర్శలూ ఉన్నాయ్‌. మూడు మున్సిపాలిటీల్లో… అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టడమే తప్ప… పనులు ముందుకు సాగడం లేదంటూ జనం పెదవివిరుస్తున్నారు. అంతేకాదు, చాలా సమస్యలు పట్టణ ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి.

సింగరేణి కార్మికులు కోపంగా ఉన్నారా?

గతంలో సింగరేణికార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు… ఐదేళ్లు గడిచినా పూర్తికాకపోవడం ఆ వర్గాల్లో కారణమవుతోంది. గోదావరి నదిపై మంచిర్యాల – అంతర్గాం బ్రిడ్జి నిర్మాణానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయ్‌. కీలకమైన రోడ్లు, ఆర్వోబీల నిర్మాణానికి ఇంకా మోక్షం లభించలేదు. మూడు మండలాలకు ప్రధాన దిక్కైన లక్షేట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రి… సిబ్బంది కొరత కారణంగా మార్చురీ దవాఖానగానే మిగిలిపోయింది. అక్కడ రోగంతో అడుగు పెడితే అంతే సంగతులన్న ప్రచారమూ జరుగుతోంది. ఇక, లోకల్‌ రూలింగ్ పార్టీ లీడర్ల భూదందాలు… ఆసరా పింఛన్లు, రైతుబీమాలో అవినీతి వ్యవహారాలతో ఎమ్మెల్యేకు చెడ్డపేరు తప్పడం లేదు.

కుమారుడి భవిష్యత్తుకోసం దివాకర్‌రావు ప్రయత్నాలు

జనాల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకు మూడు నెలలుగా ఇంటింటికీ తిరుగుతూ… ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన దివాకర్​రావుకు ఈసారి అధిష్టానం టికెట్ ఇస్తుందా.. ఇచ్చినా గెలుస్తారా? లేక వారసుణ్ని బరిలో దింపుతారా? అనే చర్చ ఓవైపు… ఒకవేళ బీసీ నినాదంతో కొత్త క్యాండిడేట్‌.. తెరమీదకొస్తే.. గతంలో మాదిరిగానే చివరి నిమిషంలో పక్క పార్టీలోకి జంప్ అవుతారా.. అనే చర్చ ఇంకోవైపు జరుగుతోందిప్పుడు. మరి, ఒక్కసారి ఛాన్స్‌ అంటున్న బీజేపీకి ఛాన్సిస్తారా? లేక కాంగ్రెస్‌ను కనికరిస్తారా? మళ్లీ దివాకర్‌రావుకే లక్కు కలిసొచ్చేలా చేస్తారా? అన్నది .. మంచిర్యాల ఓటర్లు చేతుల్లో ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Related Articles

Back to top button