News

ipl 2023 qualifier 2, IPL 2023 Final: ముంబయిని ఇంటిబాట పట్టించి ఫైనల్‌కి దూసుకెళ్లిన గుజరాత్ – gujarat titans beat mumbai indians by 62 runs in ipl 2023 qualifier 2


డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబయి ఇండియన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ టీమ్.. టైటిల్ పోరుకి అర్హత సాధించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్.. గిల్ సెంచరీతో 233 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబయి ఇండియన్స్ టీమ్ 18.2 ఓవర్లలో 171 పరుగులకి ఆలౌటైంది. ఈ ఓటమితో టోర్నీ నుంచి ముంబయి ఇండియన్స్ నిష్క్రమించగా.. ఆదివారం అహ్మదాబాద్ వేదికగానే గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పైనల్ జరగనుంది.

234 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్ టీమ్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), నేహాల్ వధీర (4) సింగిల్ డిజిట్‌కే ఔటైపోగా.. కామెరూన్ గ్రీన్ (30: 20 బంతుల్లో 2×4, 2×6), సూర్యకుమార్ యాదవ్ (61: 38 బంతుల్లో 7×4, 2×6), తిలక్ వర్మ (43: 14 బంతుల్లో 5×4, 3×6) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడారు. కానీ.. ఈ ముగ్గురి ఔట్ తర్వాత ముంబయి టీమ్ ఒత్తిడికి గురైంది. విష్ణు వినోద్ (5), టిమ్ డేవిడ్ (2) చేతులెత్తేయగా.. క్రిస్‌ జోర్దాన్ (2), పీయూస్ చావ్లా (0), కుమార్ కార్తికేయ (6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మోహిత్ శర్మ ఐదు వికెట్లతో ముంబయి పతనాన్ని శాసించాడు. జాషువా లిటిల్ కూడా ఒక వికెట్ తీశాడు.

మ్యాచ్‌లో అంతకముందు ఓపెనర్ శుభమన్ గిల్ 60 బంతుల్లోనే 7×4, 10×6 సాయంతో 129 పరుగులు చేశాడు. దాంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మరో ఓపెనర్ సాహా (18:16 బంతుల్లో 3×4) ఫెయిలైనా.. సాయి సుదర్శన్ (43 రిటైర్డ్ హర్ట్: 31 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి గిల్ దూకుడుగా ఆడి గుజరాత్ టైటాన్స్‌కి తిరుగులేని స్కోరుని అందించాడు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (28 నాటౌట్: 13 బంతుల్లో 2×4, 2×6) కూడా హిట్టింగ్ చేశాడు. ముంబయి బౌలర్లలో పీయూస్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్ చెరో వికెట్ పడగొట్టారు.

Related Articles

Back to top button