News

ipl 2023, LSG VS MI: గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు.. లేకుంటే మాత్రం.. – lsg vs mi match preview who will win the battle of lucknow


ప్లే ఆఫ్స్ సమీపిస్తున్న వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో మరో ఆసక్తికర పోరుకు వేళైంది. ప్లే ఆఫ్స్ ముంగిట ఇరుజట్లకు కీలకమైన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబయి ఇండియన్స్(Mumbai Indians) జట్లు తలపడనున్నాయి. లక్నోలోని ఏక్‌నా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో ఉన్న ముంబయి, లక్నోకు ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచులో గెలవాల్సిందే.

వరుస ఓటములతో సీజన్‌ను ప్రారంభించిన ముంబయి ఇండియన్స్.. తర్వాత బలంగా పుంజుకుంది. చివరి 5 మ్యాచుల్లో గెలిచి టాప్-3 స్థానంలో నిలిచింది. వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా వికెట్లు తీస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని కెప్టెన్ రోహిత్ శర్మ.. గత మ్యాచులో ఫర్వాలేదనిపించాడు. కీలక మ్యాచులో కెప్టెన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ బ్యాటర్ సూపర్ ఫామ్‌లో ఉండటం పట్ల ఫ్యాన్స్ కుషీగా ఉన్నారు. మిగతా బ్యాటర్లు కూడా జోరు కొనసాగించి ప్లే ఆఫ్స్‌కు రేసులో ముందుకు వెళ్లాలని యాజమాన్యం భావిస్తోంది.

సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. తర్వాత ఓటములతో కాస్త వెనకబడి పోయింది. మూడు మ్యాచుల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి కీలకమైన రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండర్లతో నిండిన లక్నో టీం.. అన్ని రంగాల్లో సమష్టిగా రాణిస్తే ముంబయిని నిలువరించే అవకాశం ఉంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబయి 12 మ్యాచుల్లో 7, లక్నో 12 మ్యాచుల్లో 6 విజయాలు సాధించాయి. ఇరు జట్లకు లీగ్ దశలో రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచులో ఓడినప్పటికీ.. రెండు జట్లకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. కాకపోతే అపుడు ఇతర జట్ల మ్యాచు ఫలితాలు, నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సి వస్తుంది. ఈ మ్యాచులో ముంబయి గెలిస్తే దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరినట్లే.

లక్నో గ్రౌండ్ ఈ సీజన్‌లో ఎక్కువగా స్పిన్‌ను సహకరిస్తోంది. ఇక్కడ జరిగిన మ్యాచుల్లో తక్కువ స్కోర్లే నమోదవుతున్నాయి. మొత్తంగా ఐపీఎల్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. రెండింటిలోనూ లక్నోనే నెగ్గింది.

లక్నో జట్టు అంచనా:
క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, పెరక్ మన్‌కడ్, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, కె.గౌతమ్, యుధ్వీర్ చారక్/ యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా

ముంబయి జట్టు అంచనా:
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేర, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, క్రిస్ జోర్దాన్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెరెన్ డార్ఫ్

Advertisement

Related Articles

Back to top button