News

India Vs Bangladesh Highlights,గిల్ సెంచరీ వృథా.. ఉత్కంఠ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఓటమి – bangladesh defeated india by 6 runs in asia cup super 4 match in colombo


బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 చివరి మ్యాచులో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచులో ఐదు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. విజయానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. 49.5 ఓవర్లలో 259 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది.

బంగ్లాదేశ్ నిర్దేశించిన 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తొలి ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. డెబ్యూ ప్లేయర్ తిలక్ వర్మ సైతం సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు. ఓ దశలో వికెట్లు పడుతున్నా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మాత్రం పట్టు వదల్లేదు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కేఎల్ రాహుల్(19), ఇషాన్ కిషన్(5), సూర్యకుమార్ యాదవ్(26), రవీంద్ర జడేజా(7) స్వల్వ స్కోర్లకే పెవిలియన్ చేరారు.

సాధికారికంగా బ్యాటింగ్ చేసిన గిల్.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2023లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గిల్ 36 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేశాడు. తర్వాతి స్థానంలో ఉన్న కోహ్లీ 22 ఇన్నింగ్సుల్లో 5 సెంచరీలు బాదాడు. సెంచరీ అనంతరం తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు గిల్.

https://x.com/cricketnmore/status/1702724807039787173?s=20

https://x.com/WisdenIndia/status/1702724760009056709?s=20

అయితే 133 బంతుల్లో 121 పరుగులు చేసిన చివరకు పెవిలియన్ చేరాడు. 43.4 ఓవర్‌లో 209 పరుగుల వద్ద గిల్ ఔట్ అయ్యాడు. దీంతో ఓటమి ఖరారైనట్లే అని అంతా భావించారు. కానీ శార్దుల్ ఠాకూర్(11), అక్షర్ పటేల్(34 బంతుల్లో 42) టీమిండియా శిబిరంలో ఆశలు రేపారు. కానీ చివర్లో వీరిద్దరూ ఔట్ అవడంతో టీమిండియా ఓటమి పాలైంది. 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసియా కప్ 2023లో భారత్‌కు ఇదే తొలి ఓటమి.

అంతకుముందు ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఓ దశలో స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ షకిబ్ అల్ హసన్(80), టౌహిద్ హ్రిడోయ్(54) రన్స్‌తో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. భారత్ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు, షమీ 2 వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచులో భారత్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. విరాట్‌ కోహ్లీ, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చారు. తిలక్ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమి, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణలను జట్టులోకి తీసుకున్నారు. ఇక ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచు ఆదివారం జరగనుంది. భారత్-శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Advertisement

Related Articles

Back to top button