News

india vs australia 2nd t20i, IND vs AUS Preview: నాగ్‌పూర్ టీ20లో బుమ్రా ఆడతాడా..? ఆ ఇద్దరిపై వేటు? – team india predicted xi for nagpur t20i vs australia as jasprit bumrah likely to comeback


IND vs AUS Preview: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ఓడిన భారత జట్టు నేడు (శుక్రవారం) రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. మొదటి మ్యాచ్‌లో ఓటమికి ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మొహాలీ మ్యాచ్‌లో 208 పరుగులు చేసినప్పటికీ.. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలమయ్యారు. దీంతో నాగ్‌పూర్ టీ20లో బౌలింగ్ విభాగం బలోపేతంపై భారత్ దృష్టి సారించింది.

గత మ్యాచ్‌లో పేసర్లు 12 ఓవర్లలోనే 150 పరుగులు సమర్పించుకోవడం భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది. గాయం కారణంగా ఆసియా కప్‌లో ఆడలేకపోయిన బుమ్రా.. ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఆడతాడని భావించగా.. అతడు ఆడకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. రెండో టీ20లోనైనా బుమ్రా ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మొహాలీలో టీ20లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య అర్ధ శతకాలు బాదగా.. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 46 పరుగులతో రాణించాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్ అంచనాలను అందుకోలేకపోయారు. అప్ఘానిస్థాన్‌పై శతకం బాది ఫామ్‌లోకి వచ్చిన విరాట్.. తొలి టీ20లో నిరాశపరిచాడు. మరోవైపు రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరూ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఆఖర్లో దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడితే భారత్ మరోసారి భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.

తొలి టీ20లో హార్దిక్ పాండ్య 30 బంతుల్లో 71 పరుగులు చేయడంతో భారత్ 200కిపైగా పరుగులు చేసింది. కానీ బౌలింగ్‌లో మాత్రం పాండ్య ఆకట్టుకోలేకపోయాడు. 2 ఓవర్లు వేసిన హార్దిక్ 22 పరుగులు ఇచ్చుకున్నాడు. రెండో టీ20లో పాండ్య మెరుగ్గా బౌలింగ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మొహాలీ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని అక్షర్ పటేల్‌ను ఆడించడం సరైన నిర్ణయమేనని అక్షర్ చాటాడు. 4 ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చిన అతడు మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి టీ20లో చాహల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో అశ్విన్‌ను ఆడించే అవకాశం ఉంది. అశ్విన్ ఆడితే బ్యాటింగ్ విభాగం కూడా బలోపేతం అవుతుంది.

మొదటి టీ20లో పేసర్ హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది.

మొహాలీ మ్యాచ్‌లో 52 పరుగులు ఇచ్చుకున్న సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో బుమ్రా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో తొలి ఓవర్లో వరుసగా 4 ఫోర్లు ఇచ్చుకున్న ఉమేశ్ యాదవ్.. ఆ తర్వాత పుంజుకొని రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి తుది జట్టులో చోటు దక్కొచ్చు.

మరోవైపు నాగ్‌పూర్‌లో వర్షం కురిసే అవకాశాలున్నాయి. బుధవారం ఉదయం వర్షం కురవడంతో మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడం కుదరలేదు. దీంతో హోటల్‌లోని జిమ్‌లోనే ఆటగాళ్లు గడిపారు.

Advertisement

Related Articles

Back to top button