News
India Boycott Tv Shows,INDIA: మీడియాపై ఇండియా కూటమి ఆంక్షలు.. ఆ టీవీ ఛానళ్లు, యాంకర్లు, షోల బహిష్కరణ – india bloc to boycott certain tv shows and anchors list to be out soon
ఇండియా కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసే మీడియా సంస్థలు, వ్యక్తులపై నిషేధం విధించేందుకు ఇండియా కూటమి సమన్వయ కమిటీకి చెందిన ఒక సబ్ కమిటీ చర్యలు చేపడుతుందని బుధవారం ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో నిర్వహించిన భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ కో ఆర్డినేషన్ కమిటీలోని సబ్ కమిటీ.. దేశంలోని ఏ ఏ ఛానళ్లు, యాంకర్లు, షోలపై నిషేధం విధించాలనే జాబితాను త్వరలోనే సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మీడియాలోని ఒక వర్గం దేశంలోని విపక్ష పార్టీలపై పదే పదే అబద్ధపు ప్రచారాలు, వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకు కొన్ని మీడియా సంస్థలు తక్కువ కవరేజీ ఇచ్చినట్లు కాంగ్రెస్ విమర్శలు చేసింది. కొన్ని మీడియా ఛానళ్ల కవరేజీ లేకున్నా ప్రజలు, సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించిందని కాంగ్రెస్ వెల్లడించింది.
దేశంలోని పలు ప్రధాన మీడియా సంస్థలు కావాలనే భారత్ జోడో యాత్రను పట్టించుకోలేదని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీకి, బీజేపీకి మద్దతు తెలుపుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వార్తలను ప్రసారం చేయలేదని ఆరోపించారు. ఒక నెల రోజుల పాటు మీడియా సంస్థల్లోని టీవీ షోల్లో జరిగే డిబేట్లకు తమ అధికార ప్రతినిధులను పంపకూడదని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. మీడియా ఛానెల్‌లు, ఎడిటర్‌లు వారి కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచవద్దని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. అయితే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీడియాపై ఆంక్షలు విధించింది. 2019 లో కూడా నెల రోజులపాటు టీవీ డిబేట్లకు తమ ప్రతినిధులు వెళ్లకుండా నిషేధం విధించింది.
Read More Latest National News And Telugu News