ind vs wi 4th t20i highlights, IND vs WI: వెస్టిండీస్‌ని నాలుగో టీ20లోనూ చిత్తుచేసిన భారత్.. సిరీస్ మనదే – india defeat west indies by 59 runs in 4th t20i
మ్యాచ్‌లో రిషబ్ పంత్ (44: 31 బంతుల్లో 6×4), అక్షర్ పటేల్ (20 నాటౌట్: 1×4, 2×6) సమయోచితంగా ఆడటంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ ఇద్దరితో పాటు సంజు శాంసన్ (30 నాటౌట్: 23 బంతుల్లో 2×4, 1×6), కెప్టెన్ రోహిత్ శర్మ (33: 16 బంతుల్లో 2×4, 3×6) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, మెకాయ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అకేల హొసెన్కి ఒక వికెట్ దక్కింది. రోహిత్, అక్షర్ దెబ్బకి మెకాయ్ వేసిన 4 ఓవర్లలోనే 16.50 ఎకానమీతో ఏకంగా 66 పరుగులు సమర్పించుకున్నాడు.
192 పరుగుల లక్ష్యఛేదనలో ఏ దశలోనూ వెస్టిండీస్ టీమ్ గెలిచేలా కనిపించలేదు. ఓపెనర్ల నుంచి లోయర్ ఆర్డర్ బ్యాటర్ వరకూ క్రీజులోకి వచ్చిన బ్యాటర్లందరూ బంతిని బలంగా బాదబోయి వికెట్ సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఛేదనలో విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (13), కైల్ మేయర్స్ (14) తక్కువ స్కోరుకే ఔటైపోగా.. అనంతరం వచ్చిన దేవాన్ థామస్ (1) కూడా తేలిపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నికోలస్ పూరన్ (24: 8 బంతుల్లో 1×4, 3×6) భారీ సిక్సర్లతో అక్షర్ పటేల్‌కి చెమటలు పట్టించాడు. కానీ.. రొవ్‌మెన్ పొవెల్ (24: 16 బంతుల్లో 1×4, 2×6)తో సమన్వయలోపం కారణంగా అతను రనౌటయ్యాడు. మిడిల్ ఓవర్లలో సిమ్రాన్ హెట్మెయర్ (19: 19 బంతుల్లో 2×4, 1×6), జేసన్ హోల్డర్ (13: 9 బంతుల్లో 1×4, 1×6) కాసేపు విండీస్ శిబిరంలో గెలుపు ఆశలు రేపినా.. అప్పటికే బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. దాంతో.. వాళ్లు కూడా బ్యాట్ ఝళిపించక తప్పలేదు. కానీ.. తెలివిగా బంతులు వేసిన భారత బౌలర్లు.. ఈ ఇద్దరినీ బుట్టలో వేసేశారు. ఆఖరికి వెస్టిండీస్ టీమ్ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది.