IND vs WI: నాలుగో టీ20లో మెరిసిన పంత్, అక్షర్.. విండీస్ టార్గెట్ 192
ప్రయోగాత్మక ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (24: 14 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (33: 16 బంతుల్లో 2×4, 3×6) ఫస్ట్ నుంచి టాప్ గేర్‌లో ఆడేశాడు. మరీ ముఖ్యంగా.. వెస్టిండీస్ బౌలర్ల మెకాయ్‌ని టార్గెట్ చేసిన హిట్‌మ్యాన్ ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టగా.. సూర్య కూడా అతనికి ఒక సిక్స్ బాదేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో మెకాయ్ 4 ఓవర్లు వేసి ఏకంగా 66 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
దూకుడుగా ఆడిన సూర్య, రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో ఔటైపోగా.. అనంతరం వచ్చిన దీపక్ హుడా (21: 19 బంతుల్లో 2×4) నిరాశపరిచాడు. కానీ.. మిడిల్ ఓవర్లలో సమయోచితంగా ఆడిన రిషబ్ పంత్ ఆఫ్ సైడ్ బౌండరీలతో ఆకట్టుకోగా.. సంజు శాంసన్ (30 నాటౌట్: 23 బంతుల్లో 2×4, 1×6) ఆఖరి వరకూ క్రీజులో ఉన్నా గేర్ మార్చలేకపోయాడు. అలానే దినేశ్ కార్తీక్ (6: 9 బంతుల్లో) కూడా అభిమానుల్ని నిరాశపరిచాడు. కానీ.. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ రెండు కళ్లు చెదిరే సిక్సర్లతో భారత్‌కి మెరుగైన స్కోరుని అందించాడు.