News

ind vs aus 3rd test, Umesh Yadav | భారత్ గడ్డపై టెస్టుల్లో ఉమేశ్ యాదవ్ రికార్డ్.. గింగిరాలు తిరిగిన ఆఫ్ స్టంప్ – fast bowler umesh yadav completes 100 test wickets in india


India vs Australia 3rd Test : భారత్ గడ్డపై టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) అరుదైన రికార్డ్‌ని అందుకున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ప్రస్తుతం ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కేవలం 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్ 12 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత్ గడ్డపై టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని కూడా ఈ ఫాస్ట్ బౌలర్ అందుకున్నాడు.

మ్యాచ్‌లో రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ స్కోరు 156/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా టీమ్ ఈరోజు మొదటి సెషన్‌ ముగిసేలోపే 197 పరుగులకి ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఈ నాలుగు కూడా బుధవారం తీసినవే. కానీ.. ఈరోజు తొలి సెషన్‌లో జడేజా వికెట్లు తీయలేకపోయినా ఉమేశ్‌తో కలిసి స్పిన్నర్ అశ్విన్ (3/44) ఆస్ట్రేలియా బ్యాటర్ల భరతం పట్టాడు. దాంతో ఆ జట్టు కేవలం 11 పరుగుల వ్యవధిలోనే ఆఖరి 6 వికెట్లు కోల్పోవడం గమనార్హం.

ఈరోజు తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్‌ని ఉమేశ్ యాదవ్ క్లీన్‌బౌల్డ్ చేసిన తీరు.. సెషన్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆఫ్ స్టంప్‌కి దూరంగా పడిన బంతి మెరుపు వేగంతో లోపలికి దూసుకొచ్చింది. దాంతో మిచెల్ స్టార్క్ ఆ బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రెప్పపాటులో అతని బ్యాట్ పక్క నుంచి వెళ్లిన బంతి ఆఫ్ స్టంప్‌ని గాల్లోకి ఎగరగొట్టింది. గంటలకి 130.3కిమీ వేగంతో వెళ్లి బంతి తాకడంతో స్టంప్‌ గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ వికెటే ఉమేశ్ యాదవ్‌కి 100వ వికెట్ కావడం విశేషం.

2011 నుంచి టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న ఉమేశ్ యాదవ్.. ఇప్పటి వరకూ 55 టెస్టు మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో 168 వికెట్లని అతను పడగొట్టగా.. ఇందులో 100 వికెట్లని భారత్ గడ్డపైనే తీయడం విశేషం. ఆస్ట్రేలియా ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లోనూ తొలి రెండు టెస్టుల్లో ఉమేశ్ యాదవ్‌కి అవకాశం దక్కలేదు. కానీ.. మూడో టెస్టులో మహ్మద్ షమీని పక్కనపెట్టి ఉమేశ్ యాదవ్‌కి అవకాశం ఇవ్వగా.. రీఎంట్రీలో ఈ పేసర్ అదరగొట్టేశాడు. బౌలింగ్‌లో కాదు.. బ్యాటింగ్‌లోనూ 13 బంతుల్లో 1×4, 2×6 సాయంతో 17 పరుగులు చేయడం విశేషం.

Read Latest Sports News, Cricket News, Telugu News

Related Articles

Back to top button