News

Imran Khan,అమెరికా ఒత్తిడితో పదవీచ్యుతుడైన ఇమ్రాన్.. వెలుగులోకి సంచలన నివేదిక – us warned pakistan of isolation if imran khan wasnot removed says report


అమెరికా ఒత్తిడితోనే ఇమ్రాన్ ఖాన్‌ను పదవీచ్యుతుడ్ని చేశారా? తన రాజీనామా వెనుక విదేశీ కుట్ర ఉందన్న ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు నిజమేనా? ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తటస్థంగా వ్యవహరించకపోవడమే ఇందుకు కారణమా? అంటే అవునని అంటోంది తాజా నివేదిక. గతేడాది మార్చి 7న అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన సమావేశంలో ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించాలని జో బైడెన్ యంత్రాంగం గట్టిగా హెచ్చరించినట్టు అమెరికాకు చెందిన వార్తా సంస్థ ది ఇంటర్‌సెప్ట్ క్లాసిఫైడ్ పాక్ ప్రభుత్వ పత్రాన్ని ఉటంకిస్తూ నివేదించింది.

అవినీతి ఆరోపణలపై ఆగస్టు 5న ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో రాజకీయ పోరాటం మరింత తీవ్రమైంది. ఖాన్ మద్దతుదారులు ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఖండిస్తున్నారు. కోర్టు నిర్ణయంతో త్వరలో జరగబోయే పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌ను పోటీకి అనర్హుడయ్యారు.

ది ఇంటర్‌సెప్ట్ నివేదిక ప్రకారం.. అమెరికాలోని పాక్ రాయబారి, ఇద్దరు యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారుల మధ్య మార్చి 7, 2022లో సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగిన నెల రోజులకే పాకిస్థాన్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం.. ఫలితంగా ఖాన్ తన ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ తప్పుకున్నారు. అవిశ్వాసంపై జరిగిన ఓటింగ్‌లో పాక్ సైన్యం మద్దతు ఉందని బలంగా నమ్ముతారు. పాకిస్థాన్ శక్తివంతమైన సైన్యం మద్దతుతో ఈ ఓటు నిర్వహించినట్లు భావిస్తున్నారు. అమెరికా ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్‌ను పదవిలో నుంచి తొలిగించారని ది ఇంటర్‌సెప్ట్ పేర్కొంది.

గత ఏడాది మార్చిలోనే అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను పదవిలో నుంచి దింపడానికి విదేశీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షాల మద్దతు కోల్పోయిన తర్వాత అవిశ్వాసానికి ముందు జాతిని ఉద్దేశించి ఖాన్ మాట్లాడుతూ.. ఒక విదేశీ శక్తి తనను తొలగించాలని, లేదంటే పాకిస్థాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని బెదిరిస్తూ లేఖ పంపిందని అన్నారు.

‘ఇమ్రాన్‌ఖాన్‌ను తొలగించాలని, లేనిపక్షంలో పాకిస్థాన్‌ తీవ్ర పరిణామాలను చవిచూస్తుందని ఓ విదేశీ ప్రభుత్వం మాకు (పాకిస్థాన్‌) సందేశం పంపింది. విదేశీ కుట్ర లేఖలో భాష.. దాని బెదిరింపు, అహంకారానికి పరాకాష్ట’ అని విమర్శించారు. తనను తొలగించడానికి విదేశీ కుట్ర జరుగుతోందని మార్చి 27న ఒక బహిరంగ ర్యాలీలో ఓ లేఖను ప్రదర్శించారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి విదేశీ నిధులతో తీసుకున్న చర్యగా ముడిపెట్టాలని ఆయన ప్రయత్నించారు.

‘సీక్రెట్’ అనే పేరుతో ఉన్న ఈ డాక్యుమెంట్‌లో బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డొనాల్డ్ లూ, అమెరికాలో అప్పటి పాకిస్థాన్ రాయబారిగా ఉన్న అసద్ మజీద్ ఖాన్‌లతో సహా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారుల మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన కథనం ఉంది. పాక్ సైన్యంలోని గుర్తుతెలియని మూలాలు ఈ పత్రాన్ని ది ఇంటర్‌సెప్ట్‌కి అందించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఇమ్రాన్ మాస్కోలో పర్యటించడం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మార్చి 2, 2022న సమావేశానికి కొద్ది రోజుల ముందు.. ఉక్రెయిన్ విషయంలో ఇతర దేశాలు తీసుకున్న తటస్థ వైఖరికి భిన్నంగా పాక్ స్టాండ్‌ను సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ విచారణలో లూను ప్రశ్నించారు. సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ అడిగిన ప్రశ్నకు లూ స్పందిస్తూ, ‘పాక్ ప్రధాని ఖాన్ ఇటీవలే మాస్కోను సందర్శించారు, కాబట్టి ఆ నిర్ణయాన్ని అనుసరించి ఆయనతో ప్రత్యేకంగా ఎలా వ్యవహరించాలో మేము గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పినట్టు ది ఇంటర్‌సెప్ట్ నివేదించింది. ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించకుంటే పాక్‌ను ఏకాకిగా మిగిలిపోతుందని హెచ్చరించినట్టు పేర్కొంది.

Read More Latest International News And Telugu News

Advertisement

Related Articles

Back to top button