News

hayathnagar car accident, పాపను సెల్లార్‌లో నిద్రపుచ్చి పనిచేస్తున్న మహిళా కూలీ.. కారు వచ్చి ఎక్కించడంతో ఘోరం – three year old girl died after run over by car in hayathnagar apartment cellar


పొట్టకూటి కోసం కూలీ పనులు చేసేందుకు వచ్చిన ఓ మహిళ.. తన మూడేళ్ల చిన్నారిని సెల్లార్ నీడలో నిద్రపుచ్చుదామనుకుంది గానీ, అదే ఆ పాపకు శాశ్వత నిద్ర అవుతుందని ఊహించలేకపోయింది. ఊహించని ప్రమాదంతో తన గారాలపట్టీని కోల్పోయి కన్నీరుమున్నీరవుతోంది. హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో బుధవారం (మే 24) మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లెక్చరర్స్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెల్లార్‌లో పనులు జరుగుతున్నాయి. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారిని వెంటబెట్టుకొని అక్కడ పనులు చేసేందుకు వచ్చింది. ఆ పాప అక్కడే కాసేపు ఆడుకుంది.

మధ్యాహ్న భోజనం తినిపించిన తర్వాత పాపను ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఖాళీగా ఉన్న ప్రదేశంలో టవల్ పరిచి, పడుకోబెట్టింది. సెల్లార్ నీడన హాయిగా నిద్రపోతుందని భావించి, తాను తిరిగి పనుల్లో నిమగ్నమైంది. కాసేపటి తర్వాత ఆ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ కారు.. సెల్లార్‌లోకి వచ్చింది. కారును నడుపుతున్న వ్యక్తి.. పార్కింగ్ ప్రదేశంలో చిన్నారిని గమనించకుండా నేరుగా ముందుకు తీసుకొచ్చాడు. వాహనం ముందు టైరు చిన్నారి మీద నుంచి పోవడంతో ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బిడ్డను కోల్పోయిన ఆ నిరుపేద మహిళ.. గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

పార్కింగ్ ప్రదేశంలో చిన్నారిని నిద్రపుచ్చుతుంటే, ఆ మహిళకు ఎవరూ ఎందుకు అడ్డు చెప్పలేదు? వాహనం నడుపుతున్న వ్యక్తి దూరం నుంచి కూడా చిన్నారిని ఎందుకు గమనించలేకపోయాడు? అనేవి ప్రశ్నార్థకంగా మారాయి. తమకు న్యాయం చేయాలంటూ చిన్నారి బంధువులు అపార్ట్‌మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

5 లక్షలు సుపారీ ఇచ్చి తండ్రిని చంపించిన కూతురు.. వివాహేతర సంబంధం ఎంత పనిచేసింది?
నగల షాపులోకి వరద.. రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు మాయం

Related Articles

Back to top button