harish rao emotional words, ఆ పిల్లలు నవ్వుతుంటే మనసు నిండిపోయింది.. హరీశ్ రావు భావోద్వేగం – minister harish rao emotional words about nims hospital surgeries for children
విదేశీ నిపుణులను తీసుకొచ్చి ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేసిన సందర్భం ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత ప్రభుత్వ నిమ్స్‌లోనే జరిగిందని హరీశ్ రావు గుర్తు చేశారు. చిన్న పిల్లలకు గుండె సర్జరీ చేయడం అనేది అత్యంత క్లిష్టమైన, ఖరీదైన వైద్యమని.. దీని కోసం ప్రైవేటులో లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే.. నిమ్స్‌లో ఈ 9 మంది చిన్నారులకు పూర్తి ఉచితంగా సర్జరీలు చేసినట్టు తెలిపారు. “నాకు ఈ రోజు ఎంతో సంతోషంగా అనిపించింది. సర్జరీ తర్వాత ఆ పిల్లలు నవ్వుతుంటే మనసు నిండిపోయింది.” అంటూ హరీశ్ రావు భావోద్వేగం వ్యక్తం చేశారు.
“తెలంగాణలో ప్రతి సంవత్సరం 6 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. వీరిలో 5,400 పిల్లలకు గుండె జబ్బులు ఉంటున్నాయి. వారిలో 1000 మందికి శస్త్ర చికిత్స అవసరం అవుతోంది. కార్పొరేట్‌కి వెళ్లలేక, సరైన సమయంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, తెలంగాణ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి వీరికి శస్త్ర చికిత్సల కొరకు ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం. పెరుగుతున్న అవసరాలకి అనుగుణంగా నిమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరో వైపు నిమ్స్ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా కొత్త బ్లాక్ ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం కోట్ల విలువైన 32 ఎకరాల ప్రభుత్వ భూమిని నిమ్స్‌కి ఇచ్చాం. దీంతో మరో 2000 పడకలు అందుబాటులోకి వస్తాయి.” అని హరీశ్ రావు తెలిపారు.
హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు తీర్చేలా.. నగరం నలుదిక్కులా సూపర్‌స్పెషాలిటీ హస్పిటళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు హరీశ్ రావు. ప్రతి హాస్పిటల్‌లో వెయ్యి పడకల చొప్పున నాలుగు వేల పడకలతో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరంగల్లో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దసరాకు సిద్ధం అవుతుందన్నారు. అత్యాధునిక వసతులతో పాటు అంతర్జాతీయ నిపుణులతో నేరుగా మాట్లాడేలా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా అందులో ఉందన్నారు. తెలంగాణలో ప్రతి లక్ష మందికి 19 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని హరీశ్ రావు తెలిపారు. 7 పీజీ సీట్లతో 2వ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు.
- Read More Telangana News And Telugu News