Gujarat High Court,బెయిల్ వచ్చినా 3 ఏళ్లు జైలులోనే ఉన్న దోషి.. కారణం ఆ ఈ మెయిల్ ! – gujarat jail fails to open bail order in email keeps back man for 3 more years
గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన గుజరాత్ హైకోర్టు.. జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆ దోషికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల చందన్‌జీ ఠాకూర్ ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలోనే 2020 సెప్టెంబర్ 29 వ తేదీన చందన్‌జీ ఠాకూర్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. అతడి శిక్షను ధర్మాసనం నిలిపివేసింది. దీనికి సంబంధించి బెయిల్ ఆర్డర్ కాపీని.. గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రీ అధికారులు.. ఈ-మెయిల్‌లో జైలు అధికారులకు పంపించారు.
అయితే ఆ జైలు అధికారులు మాత్రం ఈ-మెయిల్‌లో వచ్చిన చందన్‌జీ ఠాకూర్ బెయిల్ ఆర్డర్ కాపీని కనీసం ఓపెన్ కూడా చేయలేదు. దీంతో చందన్‌జీ ఠాకూర్ ఇప్పటివరకు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఆ వ్యక్తి మరోసారి బెయిల్ కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో గతంలోనే బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు చెప్పడంతో జైలు అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వారు ఈ-మెయిల్‌లో పంపిన బెయిల్ ఆర్డర్ కాపీని తెరిచిచూడలేదని గుర్తించారు.
ఈ సందర్భంగా జైలు అధికారుల తీరును గుజరాత్ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. బెయిల్ ఆర్డరు కాపీకి సంబంధించిన ఈ-మెయిల్‌ను జైలు అధికారులు చూడలేదని.. జిల్లా సెషన్స్ కోర్టుకు పంపించినప్పటికీ.. అక్కడ కూడా తనిఖీ చేయలేదని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషికి బెయిల్ లభించినప్పటికీ.. దాని ప్రయోజనాలను పొందలేకపోవడానికి జైలు అధికారులు కారణం అని తీవ్ర స్థాయిలో మండిపడింది. జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ దోషికి రూ.లక్ష పరిహారాన్ని అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Read More Latest National News And Telugu News