బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT)లో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వ తీరు పట్ల వ్యతిరేకతతో ఉన్న విద్యార్థి లోకానికి దగ్గరయ్యేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(governor tamilisai soundararajan) వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం 11 యూనివర్సిటీల విద్యార్థి ప్రతినిధులతో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ‘మీ కోసం నేను ఎంతవరకైనా వెళ్తా… నా అధికారం ఎంత వరకు ఉపయోగించాలో అంత వరకు ఉపయోగిస్తా’ అని గవర్నర్ విద్యార్థి నేతలకు భరోసా ఇచ్చారు.
రాజ్‌భవన్ దర్బార్ హాల్లో బుధవారంనాడు 11 యూనివర్సిటీ విద్యార్థులతో గవర్నర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీల్లో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో జరిపిన చర్చల్లో చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. విద్యార్థులు అడుగుతున్నది ‘మంచి విద్య, కనీస సదుపాయాలు, ఉపాధి అవకాశాలు’ అని కీలక వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించడం లేదన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. విద్యార్థులకు తన నైతిక మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఛాన్సలర్ హోదాలో 11 యూనివర్శిటీలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఏడాది వ్యవధిలో దశలవారీగా 75 కళాశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు.