Family Court,Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు – wilful denial of sexual relationship by a spouse amounts to cruelty says delhi high court
ఈ జంటకు 2004 లో వివాహం కాగా.. నెల రోజులకే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె తిరిగి ఇంటికి రాలేదు. అయితే భార్యను ఇంటికి తెచ్చుకోవాలని భర్త చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే విసిగిపోయిన ఆ భర్త.. చివరికి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ విడాకులను సవాల్ చేస్తూ ఆ వ్యక్తి భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. భార్య వేసిన పిటిషన్‌ను స్వీకరించి విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. చివరికి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగానే కీలక వ్యాఖ్యలు చేసింది.
విడాకుల తీర్పును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు.. శృంగారం లేని వివాహ బంధం శాపం లాంటిదని వ్యాఖ్యానించింది. శారీరక బంధంలో నిరాశకు మించిన బాధ వైవాహిక జీవితంల ఇంకోటి ఉండదని పేర్కొంది. ఈ కేసులో శృంగారానికి భార్య నిరాకరించడంతో వారి వివాహ బంధం సంపూర్ణం కాలేదని కోర్టు గుర్తించింది. దీనికి అదనంగా ఆధారాలు ఏమీ లేకుండా ఆమె భర్తపైనే ఎదురు వరకట్న వేధింపుల కేసు పెట్టిందని తెలిపింది. ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు.. ఎలాంటి కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని.. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య ఇది దారుణ పరిస్థితేనని స్పష్టం చేసింది. ఇందుకే ఈ ఒక్క కారణంతో విడాకులు మంజూరు చేయొచ్చంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీంతో వారిద్దరి మధ్య విడాకులు మంజూరు అయ్యాయి.
Read More Latest National News And Telugu News