Mlc Kavitha ED Notice: గురువారం విచారణకు రావాల్సిందిగా ఈడీ జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, లిక్కర్ స్కాంలో తాను చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరకు వెళ్తానని, ఈ కేసులో సీరియస్ ఆరోపణలు లేవని తెలిపారు. ఫోన్లను తాను ధ్వంసం చేయలేదని, అడిగితే ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇస్తానని కవిత చెప్పారు.
బీజేపీ టార్గెట్ తాను కాదని, వారి టార్గెట్ సీఎం కేసీఆర్ అని కవిత చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని, తాను ఎవరికీ భయపడనని అన్నారు. గతంలో సీబీఐ 6 గంటలపాటు ప్రశ్నిస్తే అన్ని సమాధానాలు ఇచ్చానని, ఇప్పుడు కూడా ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానన్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లేదని, అది బీజేపీ సృష్టి అంటూ కవిత ఆరోపించారు. ‘జైలుకు పంపిస్తే నేను ఏం చేస్తా.. ఇందులో నా పాత్ర అసలు లేదు’ అని కవిత పేర్కొన్నారు.