News

civils same rank for two women, UPSC: ఇద్దరికీ సేమ్ ర్యాంక్, ఇద్దరమ్మాయిలదీ ఓకే పేరు.. సివిల్స్‌లో ఇలా జరగదే! – two women from madhya pradesh claim same rank in upsc civil services results 2022


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో అత్యున్నత ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగాలు చేస్తారు. సివిల్స్ ర్యాంకర్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రైవేట్ రంగాల్లోనూ అత్యద్భుత జాబ్ ఆఫర్లు ఉంటాయి. అంతటి డిమాండ్ ఉన్న ఈ పరీక్షలను.. అడ్మిషన్ల ప్రక్రియ మొదలు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల వరకు అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారు. ఎక్కడ, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూస్తారు. అయితే, రెండు రోజుల కిందట విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 184వ ర్యాంక్ సాధించానంటూ ఇద్దరు అమ్మాయిలు వేడుక చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ఇద్దరు అమ్మాయిల పేర్ల తొలి భాగం ‘అయాషా’ కావడం గమనార్హం. వాళ్లు షేర్ చేసిన వివరాల ప్రకారం.. అడ్మిట్ కార్డులు, ఇతర వివరాలన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇంతకీ ఇద్దరిలో ఎవరిని సివిల్స్ ఉద్యోగం వరిస్తుంది? సివిల్ సర్వీసెస్ ఇలాంటి పొరపాట్లు జరుగుతాయా?మంగళవారం (మే 23) సాయంత్రం UPSC సివిల్స్ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్ జిల్లాకు చెందిన అయాషా మక్రాని (Ayasha Makrani) ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. సివిల్స్‌లో ఆమె 184వ ర్యాంక్‌ సాధించడమే అందుక్కారణం. బంధువులకు, ఇరుగుపొరుగు వారికి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని అయాషా ఫాతిమా (Ayasha Fatima) ఇంట్లోనూ ఇలాగే సంబరాలు చేసుకున్నారు. ఆమె కూడా సివిల్స్‌లో 184వ ర్యాంక్ సాధించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు.. ఒకే పేరు గల ఇద్దరు అమ్మాయిలకు సివిల్స్‌లో ఒకే ర్యాంక్ వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. ఇద్దరు అమ్మాయిలు చెప్పిన హాల్ టికెట్ నంబర్ ఒకటే (7811744) కావడంతో ఈ అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది.

అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన అయాషా మక్రానీ (23) సివిల్స్‌లో తొలి అటెంప్ట్‌లోనే ర్యాంక్ సాధించిందని ఆమె తండ్రి సలీముద్దీన్ తెలిపారు. అయాషా మ్యాథమెటిక్స్ విభాగంలో సివిల్స్ రాసి ఉత్తీర్ణత సాధించిందని ఆమె సోదరుడు షాబాజుద్దీన్ మక్రానీ తెలిపాడు. ఆయన ఒక సివిల్ ఇంజనీర్.

దేవాస్‌కు చెందిన నజీరుద్దీన్ కుమార్తె అయాషా ఫాతిమా (26) తాను నాలుగో అటెంప్ట్‌లో సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించానని చెబుతోంది. ఆమె పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌తో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసిందని నజీరుద్దీన్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, నిజం ఏంటో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

‘అయాషా మక్రానీ ఐఏఎస్ అధికారిణి కావాలనేది మా అమ్మ కల. ఆమెకు మొదటి ప్రయత్నంలోనే 184వ ర్యాంక్ వచ్చింది. మరో అభ్యర్థి గందరగోళం ఏంటో అర్థం కావట్లేదు. దీనిపై అధికారులను సంప్రదించాం. కౌంటర్ క్లెయిమ్‌ల తర్వాత మేము యూపీఎస్సీని సంప్రదించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’ అని షాబాజుద్దీన్ అన్నాడు.

నిపుణులు ఏం చెబుతున్నారు?
యూపీఎస్సీ మాత్రం అలాంటి తప్పు చేయదని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే రోల్ నంబర్‌ను కేటాయించడం అసాధ్యం అని అంటున్నారు. వాటిలో ఒకటి నకిలీది, అది ఎవరిదో తేల్చాలి అని చెబుతున్నారు.

ఇరువురి అడ్మిట్ కార్డులను లోతుగా పరిశీలించగా.. అయాషా మక్రానీ అడ్మిట్ కార్డ్‌లో పర్సనాలిటీ టెస్ట్ తేదీని ఏప్రిల్ 25 అని, ఆ రోజు గురువారం అని పేర్కొన్నారు. అయాషా ఫాతిమా అడ్మిట్ కార్డులోనూ పర్సనాలిటీ టెస్ట్ తేదీని ఏప్రిల్ 25గా పేర్కొనగా.. ఆ రోజు మంగళవారం అని ఉంది. క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 25 మంగళవారం.

అంతేకాదు, దేవాస్‌కు చెందిన అయాషా అడ్మిట్ కార్డ్‌పై క్యూఆర్ కోడ్‌తో యూపీఎస్సీ వాటర్ మార్క్ ఉంది. అయితే, అలీరాజ్‌పూర్‌కు చెందిన అయాషా అడ్మిట్ కార్డ్‌పై ఎలాంటి క్యూఆర్ కోడ్ లేకుండా సాదా కాగితంపై ప్రింట్‌అవుట్‌ను పోలి ఉంది.

ఏదేమైనా.. ఇద్దరిలో ఎవరు తమ వారిని మోసం చేస్తున్నారనేది యూపీఎస్సీ అధికారులు, పోలీసులే తేల్చాల్సి ఉంది. ఇప్పటికైతే.. ఈ విషయం ఎటూ తేలకపోవడంతో.. ఇరు కుటుంబాలకు చెందిన వారూ దీమాగా సంబరాల్లో మునిగిపోయారు.

Advertisement

Related Articles

Back to top button