News

Chiranjeevi,Undavalli Arun Kumar: కరెక్ట్‌గానే చెప్పారు.. చిరంజీవి వ్యాఖ్యలకు ఉండవల్లి సపోర్ట్.. – undavalli arun kumar supported chiranjeevi comments


Undavalli Arun Kumar: ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదేనని సమర్ధించారు. కానీ చిరంజీవి మాత్రం పిచ్చుకలాంటివారు కాదని, విభజన సమయంలో ఆయన ఒక్కరే గట్టిగా మాట్లాడారని అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం ఆ రోజు గొంతు విప్పింది చిరంజీవే అని తెలిపారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని, అలాంటి వ్యక్తి చిన్నవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు.

విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం పట్టుబట్టింది చిరంజీవే అని, కేంద్ర మంత్రి హోదాలో గట్టిగా మాట్లాడింది ఆయనేనని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చిరు పట్టుబట్టారని, ఆయన కారణంగానే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన చిరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.

ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉండవల్లి మాట్లాడారు. పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం తనకు లేదని, ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తి కాదన్నారు. పోలవరం అసలు ముందుకు కదలడం లేదని, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే టీడీపీ, వైపీపీ కాకుండా మరో పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. ఏపీ కంటే తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో ముందు వరుసలో ఉందని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్లే ఇది సాధ్యమైందని ఉండవల్లి పేర్కొన్నారు.

చిరంజీవి అభిమానుల ఆందోళన

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చిరంజీవి అభిమానులు ఆందోళన చేపట్టారు. చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, అమర్నాథ్ క్షమాపణ చెప్పాలంటూ గడియార స్తంభం సెంటర్‌లో నిరసన చేపట్టారు.
సినీ పరిశ్రమ కోసం చిరంజీవి చేస్తున్న కృషి ఎవరు చేయలేదన్నారు. సినీ పరిశ్రమ కోసం జగన్‌ను కలిసినప్పుడు ఆయనను అవమానపరిచినా మౌనంగా ఉన్న వ్యక్తి చిరంజీవి అని అన్నారు. చిరుపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్ల చిట్టిబాబు, అఖిలభారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఏడిద శ్రీను పాల్గొన్నారు.

Related Articles

Back to top button