News

Chhattisgarh Assembly Polls,అసెంబ్లీ ఎన్నికల వేళ నోట్ల కట్టలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్.. బీజేపీ విమర్శలు – chhattisgarh congress mla seen with huge cash in viral video bjp sharpens attack


ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లోని శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. భారీగా డబ్బు కట్టల ముందు ఆ ఎమ్మెల్యే ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో ప్రతిపక్ష బీజేపీకి ఎన్నికల ముందు భారీ ఆయుధం దొరికినట్లయింది. అధికార పార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారని.. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం అంటూ దాన్ని బీజేపీ నేతలు షేర్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సదరు ఎమ్మెల్యే.. తన ప్రతిష్ఠను, గౌరవాన్ని కించపరిచే యత్నం బీజేపీ చేస్తోందని ఎదురు దాడికి దిగారు.

ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రాపూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్.. తాజాగా వివాదంలో పడ్డారు. ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో రామ్‌కుమార్ సహా మరో ఇద్దరు వ్యక్తులు అందులో ఉన్నారు. భారీగా నగదు కట్టలు ఉన్న మంచం పక్కన ఉన్న సోఫాలో ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్ కూర్చుకున్నారు. అతని పక్కనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే మూడో వ్యక్తి ముఖం మాత్రం వీడియోలో సరిగా కనిపించడం లేదు.

ఈ వీడియోను ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఓపీ చౌదరి ఆదివారం తన ట్విటర్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ను కాంగ్రెస్ పార్టీ.. అవినీతికి అడ్డాగా మార్చిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. నోట్ల కట్టలతో దొరికిపోయినట్లు ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. ఈ వీడియోపై ఏదైనా సందేహం ఉంటే.. దాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించే ధైర్యం చేస్తుందా అని ఓపీ చౌదరి నిలదీశారు. రామ్‌కుమార్ యాదవ్‌ను పేదవాడిగా గుర్తించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటిని కేటాయించిందని.. అతని తండ్రి, తాత పశువులను మేపేవారని చెబుతుండగా.. ఈ వీడియోలో ఉన్న నగదు కట్టల సంగతేంటని ప్రశ్నించారు.

ఐదేళ్లుగా కాంగ్రెస్‌ నేతలు ఛత్తీస్‌గఢ్‌ను దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతి సంస్కృతి, మాఫియా రాజ్యంలో ఫ్లై యాష్, ఇసుక, బొగ్గు, మద్యంతో సహా ప్రతిదానిలో అవినీతి చోటు చేసుకుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ ఈ వీడియో నిజమని నమ్ముతారా.. తన సొంత పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. సీఎంకు ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియోపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

అయితే వీడియో, బీజేపీ ఆరోపణలపై ఎమ్మెల్యే రామ్ కుమార్ యాదవ్ స్పందించారు. పేద వర్గాలకు చెందిన తాను ఎమ్మెల్యే కావడాన్ని జీర్ణించుకోలేని కొందరు భూస్వామ్యవాదులు.. ప్రతిష్టను కించపరిచే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వీడియోలో తాను డబ్బు వైపు చూడలేదని.. తనకు అవసరం కూడా లేదని.. తన దృష్టి కూడా అటు వైపు లేదని స్పష్టం చేశారు. తాను అక్కడ కూర్చున్నపుడు తనకు ఏదో విషయం చెబుతున్నారని తెలిపారు. తాను విమానంతో గానీ, పెద్ద భవనంతో గానీ ఫోటో దిగితే వాటికి యజమానిని అవుతానా అని ప్రశ్నించారు. ఆ వీడియోలో చూపించిన డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ సందర్భంగా ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

చున్నీ లాగడంతో సైకిల్‌పై నుంచి కిందపడి యువతి మృతి.. నిందితులపై పోలీసుల కాల్పులు
Bengaluru Airport: బెంగళూరు ఎయిర్‌పోర్టుపై మాధవన్ కీలక వ్యాఖ్యలు.. స్పందించిన ప్రధాని మోదీ
Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button