News

Chandrababu Remand,Rajahmundry Jail: చంద్రబాబు భద్రతపై ఆందోళన.. సెలవుపై వెళ్లిన రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ – superintendent of rajahmundry jail who went on leave during the concern over chandrababus security


Rajahmundry Jail: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌‌లో ఉన్నారు. అయితే తాజాగా ఆ జైలు సూపరింటెండెంట్ సెలవు పెట్టి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే జైలు సూపరింటెండెంట్‌ వ్యక్తిగత కారణాలతోనే సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న రాహుల్‌ను ట్రాన్స్‌ఫర్ చేసి ఆ స్థానంలో కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తారని గత కొన్ని రోజులుగా తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్న వేళ.. ఆయన సెలవులపై వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవులు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాహుల్ భార్య అనారోగ్యంతో బాధపడుతుందని అందుకే జైలు సూపరింటెండెంట్‌ సెలవులు పెట్టినట్లు రాజమండ్రి జైలు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్‌ భార్యను అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు లాంటి హై ప్రొఫైల్ కలిగి ఉన్న వ్యక్తి రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉండటంతో జైలు బాధ్యతలను మరొకరికి అప్పగించారు. రాహుల్ మళ్లీ జైలు సూపరింటెండెంట్‌గా విధుల్లోకి వచ్చేవరకు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌కు రాజమండ్రి సెంట్రల్ జైలు ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించారు.

మరోవైపు.. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కలిశారు. అయితే బాలకృష్ణ, లోకేశ్‌లతో కలిసి.. పవన్ కల్యాణ్ జైలుకు వెళ్లి చంద్రబాబు నాయుడును ములాఖత్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసిన తర్వాత బయటికి వచ్చిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈసారి జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లి జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్‌ను గద్దె దించుతామని ప్రకటించారు.

Related Articles

Back to top button