News

botsa satyanarayana, చంద్రబాబు కోర్టుల ముందు ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి: మంత్రి బొత్స – minister botsa satyanarayana allegations against tdp chief chandrababu naidu


తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోర్టుల ముందు ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు ఓ దోపిడీ దొంగ అని.. ఆయన బయటపడటం అంత తేలిక కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఈ స్కామ్‌లో ఉండబట్టే దర్యాప్తు చేయలేదన్నారు.

ఈ మేరకు ఆదివారం మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. సీమెన్స్‌ పేరుతో చంద్రబాబు దోపిడీపై అసెంబ్లీలో చర్చించామని.. సోమవారం కూడా స్కిల్‌ డెవలప్మెంట్‌ దోపిడీపైనే చర్చిస్తామని వెల్లడించారు. కొన్ని పత్రికలు తిమ్మని బమ్మిని చేయాలని ప్రయత్నించాయని పేర్కొన్నారు. 2004లో వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆరోజున తాను ఎంత మానసిక క్షోభ అనుభవించానో తనకు మాత్రమే తెలుసన్నారు. ఆ వ్యవహారంపై ఆరోజు తామే సీబీఐ విచారణ కోరామని గుర్తు చేశారు.

కానీ, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్‌ శాఖలో రూ. 330 కోట్ల దోపిడీ జరిగితే ఎందుకు కేంద్ర సంస్థల దర్యాప్తు కోరలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఈ కుంభకోణాన్ని జీఎస్టీ, ఈడీ సంస్థలు గుర్తించినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఈ స్కామ్‌లో ఉండబట్టే ఆయన దర్యాప్తు చేయించలేదని ఆరోపించారు.

ఇక, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అన్నాక గెలుపోటములు సహజమేనని.. ఎక్కడ పొరబాటు జరిగిందో విశ్లేషించుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం ఏ సెక్షన్‌ను ప్రభావితం చేయలేకపోయామనేది విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టంతో పుట్టిన పార్టీ అని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వచ్చిందన్నారు. చంద్రబాబు లాగా మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోలేదని వ్యాఖ్యానించారు.

Related Articles

Back to top button