News

Bharat,Special Parliament Sessions: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాపై వీడని ఉత్కంఠ.. ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశం – special sessions agenda unknown centre calls all party meet day before


Special Parliament Sessions: ఈనెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమావేశాల్లో ఏం చర్చిస్తారన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండాను పార్లమెంటు నిబంధనలకు అనుగుణంగా వెల్లడిస్తామని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఒకరోజు ముందు అఖిల పక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈనెల 17 న సాయంత్రం అన్ని పార్టీలతో కలిసి భేటీ నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో ఈ అఖిల పక్ష భేటీలోనే ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్రం బయటపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. పాత పార్లమెంటు భవనంలో 18 న ప్రారంభమై 19 వ తేదీన కొత్త పార్లమెంటు భవనంలోకి తరలించనున్నారు. ఇక ప్రత్యేక సమావేశాల తేదీలకు సంబంధించి పలువురు పార్టీల నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం గణేష్ చతుర్థి పండగ ఉన్న నేపథ్యంలో ఆ రోజు సమావేశాలు నిర్వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి చాలా ముఖ్యమైన పండగ అని.. ఆ రోజు సమావేశాలు కొనసాగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని.. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు. మరోవైపు.. పార్లమెంటు సమావేశాల షెడ్యూల్‌ను మార్చాలని ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే డిమాండ్ చేశారు.

ఇక సమావేశాల ఎజెండా గురించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండానే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు పిలుపునిచ్చారని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల గురించి ఎలాంటి సమాచారం లేదని.. ఎజెండా కూడా విడుదల చేయలేదని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి సోనియా గాంధీ పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, దేశంలో విస్తరిస్తున్న మత ఘర్షణలు, చైనాతో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం, ఇటీవల చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్‌ వంటి అంశాలను ప్రత్యేక సమావేశాల ఎజెండాలో చేర్చాలని సోనియాగాంధీ.. ప్రధానిని డిమాండ్ చేశారు.

అయితే అమృత్ కాల్, భారత్ అభివృద్ధి చెందిన దేశం అనే అంశాలు ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటితోపాటు ఇటీవల ఇస్రో సాధించిన ఘన విజయమైన చంద్రయాన్ 3.. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు సంబంధించి చర్చిస్తారని పేర్కొన్నాయి. ఇక ఇటీవల ఇండియా పేరును భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం తీవ్ర ఉత్కంఠగా మారింది.

Mumbai: ముంబైని కేంద్రపాలిత ప్రాంతం చేయడమే ప్రత్యేక సమావేశాల ఎజెండా: కాంగ్రెస్ చీఫ్
Parliament Special Sessions: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాలో ముఖ్యమైన అంశాలు: కేంద్రం

Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button