Bharat Mandapam,G20 Summit: రూ.990 కోట్ల నుంచి రూ.4100 కోట్లకు పెరిగిన జీ20 సదస్సు ఖర్చు.. మోదీ కోసమే పెంచారన్న విపక్షాలు – over rs 4100 crore spent on delhi for g20 summit criticism of the opposition
ముఖ్యంగా ఈ జీ20 సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత ప్రచారానికి వాడుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భారీగా ఖర్చు చేసి హంగులు, ఆర్భాటాలతో దేశ సొమ్మును వృథా చేశారని విపక్షాలు తీవ్ర స్థాయిలో మోదీ సర్కార్‌పై తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే విమర్శలు గుప్పించారు. ముందుగా కేటాయించిన రూ. 990 కోట్లు కాకుండా.. రూ. 4100 కోట్లు జీ20 సదస్సు నిర్వహణకు కావడం దారుణమని గోఖలే మండిపడ్డారు. ఇదంతా ప్రధాని మోదీ ఇమేజ్ పెంచుకోవడానికే వాడుకున్నారని.. అందుకే రూ. 4100 కోట్లలో నుంచి ముందు కేటాయించిన రూ. 990 కోట్లు మినహాయించి.. రూ. 990 కోట్లు కాకుండా.. మిగిలిన రూ. 3110 కోట్లను బీజేపీ నుంచి వసూలు చేయాలని సాకేత్ గోఖలే డిమాండ్ చేశారు.
జీ 20 సదస్సు పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రచారానికి.. ఆయన పోస్టర్లకు ప్రజల సొమ్మును వాడుకున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విదేశాల నుంచి వచ్చిన అతిథులకు అత్యంత ఖరీదైన బంగారు, వెండి పాత్రల్లో ఆహారాన్ని వడ్డించి అనవరస ఆర్భాటాలకు ఖర్చు చేశారని మండిపడింది. ఢిల్లీలో ఉన్న మురికి వాడలను, పేదల ఇళ్లను ప్రపంచ దేశాల అధినేతలకు కనిపించకుండా చర్యలు తీసుకుని.. దేశంలో ప్రస్తుత పరిస్థితిని కనిపించకుండా చేశారని ఆరోపించింది.
అయితే జీ20 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చులపై విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ టీం ఖండించింది. అంచనాలకు మించి జీ20 సదస్సు కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించింది. అయితే ఆ డబ్బును కేవలం సదస్సు నిర్వహణ కోసమే కాకుండా మౌలిక వసతుల కల్పనకు కూడా వినియోగించినట్లు స్పష్టం చేసింది. మౌలిక వసతుల కోసం వినియోగించిన నిధులు ఏమీ వృథా కాదని.. అవి భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. మరోవైపు.. వర్షానికి భారత్ మండపం వర్షపు నీటిలో మునిగిపోయిందన్న వార్తలను కూడా పీఐబీ ఫాక్ట్ చెకింగ్ టీమ్ ఖండించింది. కొన్ని ప్రాంతాల్లోనే వరద నీరు వచ్చి చేరిందని.. అయితే ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా భారత్ మండపం మొత్తం నీటిలో మునిగలేదని స్పష్టం చేసింది.
Read More Latest National News And Telugu News