Ashok Gelhlot,Govt Jobs: రేప్‌లు, వేధింపులకు పాల్పడేవారికి ప్రభుత్వ ఉద్యోగాలకు నో ఛాన్స్.. సర్కార్ సంచలన నిర్ణయం – people involved in acts of molestation rape banned from govt jobs in rajasthan
బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పాల్పడేవారికి ఇక నుంచి రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వేధింపులకు పాల్పడేవారి క్యారెక్టర్ సర్టిఫికేట్‌లో ఇలాంటి నేరాలకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారని.. అలాంటి సర్టిఫికేట్ ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అనర్హులు అవుతారని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని శాంతి భద్రతలపై ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ట్విటర్‌లో వెల్లడించారు.
మహిళలు, బలహీనవర్గాలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమని అశోక్ గెహ్లాట్ చెప్పారు. నిందితులకు సంబంధించిన వివరాలను రికార్డు ఉంచాలని రాజస్థాన్ సీఎం అధికారులకు సూచించారు. అలాంటి వారిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రాకుండా అడ్డుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం అత్యాచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక రికార్డును నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. అలాంటి వ్యక్తుల పేర్లు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ వంటి ప్రభుత్వం ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ బోర్డులకు పంపనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను.. ఈ ప్రత్యేక రికార్డుల్లో ఉన్న వివరాలతో సరిపోల్చనున్నట్లు చెప్పారు. ఒకవేళ రికార్డుల్లో ఉన్న పేరు గల అభ్యర్థులు.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే వెంటనే దాన్ని రిజెక్ట్ చేయాలని చెప్పారు. దీని కోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని.. భిల్వారా ఘటన విషాదకరమని అధికారుల సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రస్తావించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Read More Latest National News And Telugu News