Artificial Intelligence,ChatGPT: అద్భుతం.. 3 ఏళ్లుగా 17 మంది డాక్టర్లు చేయలేనిది.. చాట్‌జీపీటీ చేసి చూపింది! – 17 doctors over 3 years couldnt diagnose 4 year olds pain chatgpt finally provides answers
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాంటి ప్రశ్నలకైనా సులువుగా సమాధానం చెప్పే చాట్‌జీపీటీ గురించి.. అది చూపించిన పరిష్కారాల గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే అందులో ఎంత నిజం ఉందన్నది ప్రశ్నే అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. అయినా ఈ విషయం తెలుసుకుంటే మాత్రం చాట్‌జీపీటీతో ఏదైనా సాధ్యమే అని తెలుస్తుంది. కోర్ట్నీ అనే మహిళకు ఒక 4 ఏళ్ల కొడుకు అలెక్సా ఉన్నాడు. అయితే అతనికి గత కొన్నేళ్లుగా ఉన్న అనారోగ్యానికి గల కారణం ఏంటో ఆమె తెలుసుకోలేకపోయింది. ఎన్ని ఆస్పత్రులు, ఎంత మంది డాక్టర్ల వద్దకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కరోనా మహమ్మారి వెలుగు చూసిన సమయంలో అనారోగ్యానికి గురైన అలెక్సాను 3 సంవత్సరాల నుంచి 17 మంది డాక్టర్లు పరిశీలించారు. అయినా అతనికి ఉన్న రోగం ఏంటో ఎవరూ గుర్తించలేకపోయారు.
చివరికి కోర్ట్నీకి ఏం చేయాలో తెలియక కంప్యూటర్‌లో చాట్‌జీపీటీలో వెతకడం ప్రారంభించింది. రోజు మొత్తం అందులో తన కుమారుడికి వచ్చిన రోగం గురించి.. దాని లక్షణాల గురించి సెర్చ్ చేసింది. ఈ క్రమంలోనే తన కుమారుడికి వచ్చిన జబ్బును గుర్తించింది. ఏం తిన్నా పళ్లలో నొప్పి, కొడుకు ఎత్తు పెరగకపోవటం వంటి వింత లక్షణాలు అలెక్సాకు ఉన్నాయి. తన కుమారుడికి తీసిన ఎంఆర్‌ఐ రిపోర్డ్‌లో ఉన్న ప్రతి అంశం గురించి చాట్‌జీపీటీని ప్రశ్నలు అడిగింది. అలెక్సాకు ఉన్న వ్యాధి లక్షణాలను చాట్‌జీపీటీకి వివరించింది. చివరకి ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ అనే అరుదైన న్యూరోలాజికల్ కండిషన్‌తో తన కొడుకు అలెక్సా బాధ పడుతున్నట్లు గుర్తించింది.
వెంటనే న్యూరోసర్జన్‌ను సంప్రదించిన కోర్ట్నీ.. తన కొడుక్కి టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆ దిశగా పరీక్షలు చేసిన డాక్టర్లు.. అలెక్స్ జబ్బుని గుర్తించి సర్జరీ చేశారు. దీంతో తన కుమారుడు వ్యాధి నుంచి కోలుకున్నట్లు కోర్ట్నీ తెలిపింది. గతంలో కంటే తన కొడుకు కొంత ఎత్తు కూడా పెరిగాడని వెల్లడించింది. అయితే వైద్య రంగంలో పలు రోగాలను గుర్తించడంలో ఇప్పటికే చాట్‌జీపీటీ ఎన్నోసార్లు సహాయపడింది.
Read More Latest International News And Telugu News