News

Ap Relief From Power Cuttings,ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. కరెంట్ కోతల కష్టాలు తొలగినట్లే! – relief for andhra pradesh people from power cuttings after electricity department employees withdraws strike


ఏపీలో విద్యుత్ కోతలతో జనాలు ఇబ్బందిపడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉన్న జనాలు విద్యుత్తు కోతలతో అల్లాడిపోయారు. కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా విద్యుత్ కోతలు మొదలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, చిత్తూరు, శ్రీ సత్యసాయి, పశ్చిమగోదావరితో పాటూ పలు జిల్లాలో విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో ఉక్కపోతకు జనం అల్లాడిపోయారు. జనం విద్యుత్‌శాఖను సంప్రదించినా స్పందన లేదని ఆరోపించారు. రాత్రి వేళలో విద్యుత్ కోతలతో దోమల బెడద ఎక్కువై చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు. దుగ్గిరాల మండలంలో విద్యుత్తు కోతలను నిరసిస్తూ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బుధవారం రాత్రి పెదపాలెం సబ్ స్టేషన్‌ను ముట్టించారు. ఆ వెంటనే అధికారులు సరఫరాను పునరుద్ధరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్తు కోతలతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలకలూరులో కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. పొన్నూరు మండలం మురుకుదురులో విద్యుత్తు కోతలను నిరసిస్తూ రాస్తారోకోకు దిగారు.

విద్యుత్‌ ఉత్పత్తి పడిపోవడమే కోతలకు కారణమని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వినియోగం కూడా పెరగడంతో కరెంటు కోతలు తప్పడం లేదనే వాదన వినిపిస్తోంది. మరో వాదన కూడా వినిపిస్తోంది.. విద్యుత్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు తమ మొబైల్స్ నుంచి సిమ్‌లను తొలగించారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో విద్యుత్తు కోతలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక జనాలు ఇబ్బంది పడ్డారు. అయితే బుధవారం రాత్రి ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులతో చర్చలు జరిపింది.. అవి సఫలం కావడంతో సమ్మెను విరమించారు. ఇక విద్యుత్ ‌కోతలు ఉండవని చెబుతున్నారు.. అయితే జనాలు మాత్రం రాత్రి వేళల్లో కరెంట్ కోతలు సరికాదంటున్నారు.

విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ సహా పలు డిమాండ్లపై సమ్మెకు సిద్ధం కాగా.. ప్రభుత్వం చర్చలకు పిలిచింది. దీంతో గురువారం నుంచి జరగాల్సిన నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలన్న ఉద్దేశంతో.. నష్టమే అయినా ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించామని జేఏసీ నేతలు తెలిపారు. యాజమాన్యానికి, జేఏసీకిమధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై శుక్రవారం అధికారికంగా సంతకాలు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని ఉద్యోగ సంఘాలను తాము కోరామని.. జేఏసీ అంగీకరించిందన్నారు. ఫిట్‌మెంట్‌ను 8 శాతం వరకూ ఇచ్చామని.. ఒకటి రెండు ఇబ్బందులున్నా వాటన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.

ప్రజల ఇబ్బందులు, విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అన్నారు. 85 శాతం మంది కోర్కెలను పరిష్కరించామన్న సంతృప్తి ఉందన్నారు. అందుకే ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించి సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. దీంతో ఏపీ ప్రజలకు కూడా రిలీఫ్ దక్కిందనే చెప్పాలి.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button