anantasagar road accident, మంచి జాబ్స్ సాధించిన బ్రదర్స్.. లైఫ్ సెటిల్డ్ అనుకున్నారు.. కానీ అంతలోనే.. – brothers died in a road accident in karmnagar district
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్ శారద దంపతులకు ఇద్దరు పిల్లలు. మనోహర్ వారంతపు సంతల్లో బట్టలు విక్రయిస్తూ.. శారద కూలీ పనులు చేస్తూ.. తమ ఇద్దరు కుమారులను చదివించారు. వీరిలో పెద్ద కుమారుడు శివరామకృష్ణ (25) ఇటీవలే రైల్వే శాఖలో టీసీగా ఉద్యోగం సాధించాడు. సికింద్రాబాద్‌లోని మౌలాలిలో శిక్షణ పొందుతున్నారు. చిన్న కుమారుడు హరికృష్ణ (23) హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు. హరికృష్ణ నాలుగు రోజుల క్రితం, శివరామకృష్ణ ఆదివారం స్వగ్రామం కందుగుల వచ్చారు.
శివరామకృష్ణకు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోనూ ఉద్యోగం రాగా.. ఏ ఉద్యోగంలో చేరాలనే దానిపై ఇంట్లో అందిరితో చర్చించాడు. కుటుంబ సభ్యులతో ఇద్దరు అన్నదమ్ములు సంతోషంగా గడిపారు. అనంతరం తిరిగి విధులకు వెళ్లేందుకు గాను సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు బైక్‌పై హైదరాబాద్ బయలు దేరారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అన్నదమ్ములిద్దరూ.. ఎగిరి రోడ్డుపక్కన పడిపోయారు. ఇద్దరికి తలతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అన్నదమ్ములిద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పాయారు.
రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతులు కందుగుల గ్రామానికి చెందిన వారిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నత ఉద్యోగాలు సాధించి తమకు ఆసరాగా ఉంటారనుకుంటే ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయారా బిడ్డా అంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లగా.. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగి మంచి ఉద్యోగాలు సాధించిన అన్నదమ్ములు ఒకేసారి చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం ఆరా తీస్తున్నారు. రహదారి వెంట ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
- Read More Telangana News And Telugu News