Entertainment

Tegimpu Movie Review: అజిత్ తెగింపు మూవీ రివ్యూ .. యాక్షన్ డ్రామా విత్ మెసేజ్..


Tegimpu

సినిమా రివ్యూ: తెగింపు

నటీనటులు: అజిత్, మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని, అజయ్ కుమార్ తదితరులు

సంగీత దర్శకుడు: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: నిరవ్ షా

ఎడిటర్: విజయ్ వెలికుట్టి

దర్శకుడు : హెచ్ . వినోద్

నిర్మాత: బోనీ కపూర్

అజిత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ హైప్ బాగానే ఉంటుంది. పైగా పొంగల్‌కు వచ్చే సినిమా అంటే కచ్చితంగా అంచనాలు మరోలా ఉంటాయి. తాజాగా అజిత్ నటించిన తెగింపు కూడా అదే స్థాయి అంచనాలతో పండగ బరిలో నిలిచింది. మరి ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది..?

కథ:

Advertisement

వైజాగ్‌లోని యువర్ బ్యాంక్‌ను దోచుకోడానికి ఓ గ్యాంగ్ ప్లాన్ చేస్తారు. అందులోనే పోలీస్ ఆఫీసర్ రామచంద్ర (అజయ్) కూడా ఉంటాడు. అయితే ఆయన గ్యాంగ్ లోపలికి వెళ్లిన తర్వాత.. అక్కడ మరో గ్యాంగ్ చీఫ్ డార్క్‌డెవిల్ (అజిత్ కుమార్).. అతడి టీం రమణి (మంజు వారియర్) ఉంటారు. వాళ్లు కూడా బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేస్తారు. కానీ ఈ రెండు గ్యాంగ్స్ కాకుండా.. మూడో గ్యాంగ్ కూడా బ్యాంక్ లోపలే ఉంటారు. మరి మొదటి గ్యాంగ్ ఎందుకొచ్చారు.. అజిత్ అక్కడేం చేస్తున్నాడు.. మూడో గ్యాంగ్‌కు పనేంటి..? ఈ మూడు గ్యాంగ్స్‌‌లో ఎవరు బ్యాంక్ రాబరీ చేసారు..? అసలు అజిత్ ఎందుకు దొంగతనం చేయడానికి వస్తాడు..? అనేది అసలు కథ. గతంలో అదే బ్యాంక్ ప్రజల సొమ్ము 25 వేల కోట్లు కాజేస్తారు.. దాని కోసం డార్క్ డెవిల్ అజిత్ ఏం చేసాడు అనేది స్క్రీన్ మీద చూడాలి..

కథనం:

బ్యాంకు మోసాల నేపథ్యంలోనే ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు వినోద్. ఇదే కథను కాస్త అటూ ఇటూగా సర్కారు వారి పాటలో మహేష్ బాబుతో చెప్పించాడు దర్శకుడు పరశురామ్. అందులోనూ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన బడా వ్యక్తుల గురించి చెప్పుకొచ్చాడు. ఆ భావం కామన్ జనంపై ఎలా పడుతుందనేది అసలు కథ. ఇందులోనూ అదే కథ.. కాకపోతే ఇక్కడ క్రెడిట్ కార్డులు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో జనాల దగ్గర సొమ్ము దోచేసి.. దాన్ని బ్యాంకులు ఎలా మాయం చేస్తున్నాయనేది చూపించాడు వినోద్. దానికి అజిత్ లాంటి స్టార్ తోడు కావడంతో మెసేజ్ ఇంకా బలంగా మారింది. డబ్బులు దాచుకోడానికి బ్యాంక్ కంటే సేఫ్ ప్లేస్ ఏముంటుంది..? కానీ ఆ బ్యాంకులో పెట్టిన డబ్బులే మాయమైపోతే.. ఊహించుకోండి.. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో..? అజిత్ తెగింపు సినిమా కథ ఇదే. చాలా రిలేటబుల్ కథను తీసుకున్నాడు దర్శకుడు వినోద్.. సర్కారు వారి పాటలో మహేష్ ఓ రకమైన దోపిడి గురించి చెప్తే.. ఇందులో అజిత్ మరో రకమైన దోపిడి గురించి చెప్పాడు. క్రెడిట్ కార్డులనీ.. ఆ కార్డులనీ.. బ్యాంకులు చేస్తున్న స్కామ్‌నే కథగా తీసుకున్నాడు వినోద్. దానికే కావాల్సిన కమర్షియల్ హంగులు అద్దాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కేవలం ఫ్యాన్స్ కోసమే తీసినట్లు అనిపిస్తుంది. ఇలాంటి హై యాక్షన్ థ్రిల్లర్‌లో కామెడీ ఊహించలేం.. కానీ మొదటి అరగంట ఎంటర్‌టైనింగ్‌గానూ నడిపించాడు దర్శకుడు. అజిత్ స్టైల్ ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్.. స్క్రీన్ మీద చించేసాడు. యాక్షన్ సీక్వెన్సులు బాగానే ఉన్నా.. లాజిక్ లేని కొన్ని సీన్స్ ఇబ్బంది పెడతాయి. అదొక్కటే తెగింపు సినిమాకు ప్రధానమైన మైనస్.. పైగా కథ కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది.. క్లైమాక్స్ అంతకంటే రొటీన్. అన్నింటికి మించి కథ ఒకే చోట జరుగుతుంది. దాంతో మొనాటినీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన కథే ఇది. అజిత్ తన స్టామినాతో నిలబెట్టేసాడు. బ్యాంక్ స్కామ్ జరిగిన తర్వాత.. ఓనర్లను కూర్చోబెట్టే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఓవరాల్‌గా తెగింపు.. కమర్షియల్ యాక్షన్ డ్రామా విత్ మెసేజ్..

నటీనటులు:

అజిత్ అదరగొట్టాడు.. కథతో సంబంధం లేకుండా తన పాత్ర వరకు మాత్రం ఇరగదీస్తుంటాడు ఈయన. ఇప్పుడు ఇదే చేసాడు. అజిత్ వల్లే ఈ సినిమాను చూడొచ్చు అనేలా నటించాడు. మంజు వారియర్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది.. ఆమెకు 44 ఏళ్లంటే నమ్మలేం. చాలా అంటే చాలా అందంగా కనిపించారు మంజు. సముద్రఖని పాత్ర బాగుంది. కమీషనర్ పాత్రకు ప్రాణం పోసారు. మరో కీలక పాత్రలో తెలుగు నటుడు అజయ్ బాగా నటించాడు. విలన్‌గా జాన్ కొక్కెన్ బాగున్నాడు. మిగిలిన వాళ్లంతా పాత్రల పరిధి మేర నటించారు..

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం బలం. ముఖ్యంగా మూడు పాటలు మాత్రమే ఉండటంతో.. బ్యాంగ్రౌండ్ స్కోర్ మీదే మొత్తం ఆధారపడి ఉంది. దాన్ని నూటికి నూరు శాతం నిరూపించాడు జిబ్రాన్. విజయ్ వెలికుట్టి ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకు ఓకే కానీ సెకండాఫ్ మాత్రం స్లోగా అనిపించింది. కొన్ని లాజిక్ లేని సీన్స్ సినిమాలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. నిరవ్ షా గురించి ప్రత్యేకంగా ఈ డిపార్ట్‌మెంట్‌లో చెప్పేదేం లేదు. వినోథ్ కథకుడిగా బాగానే ఉన్నా.. దర్శకుడిగా మాత్రం సగం మార్కులే వేయించుకున్నాడు. గతేడాది ఈయన చేసిన వలిమై కంటే ఇది కాస్త బెటర్ అనిపించింది కానీ అద్భుతం మాత్రం కాదు. యాక్షన్ సీక్వెన్సులు బాగున్నా.. సినిమా మాత్రం అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు.

పంచ్ లైన్:

తెగింపు.. యావరేజ్ యాక్షన్ డ్రామా విత్ మెసేజ్..

Related Articles

Back to top button