Adenovirus: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న అడెనోవైరస్.. గత 24గంటల్లో ఏడుగురు మృతి.. | Adenovirus in West Bengal: Seven Children Die Due to Acute Respiratory Infection in Last 24 Hours
భారత్‌లో మరో వైరస్ అలజడి రేపుతోంది. అడెనో వైరస్.. కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏడుగురు మరణించారు. రెండేళ్లలోపు చిన్నారులను అడెనో వైరస్ బలి తీసుకుంటుండంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
భారత్‌లో మరో వైరస్ అలజడి రేపుతోంది. అడెనో వైరస్.. కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏడుగురు మరణించారు. రెండేళ్లలోపు చిన్నారులను అడెనో వైరస్ బలి తీసుకుంటుండంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అడెనో వైరస్ కట్టడికి చర్యలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్‌లో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించారని సీనియర్ ఆరోగ్య అధికారి గురువారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ మరణాలు నమోదయ్యాయని, వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే, అడెనోవైరస్ కారణంగా గత 24 గంటల్లో ఎన్ని మరణాలు సంభవించాయనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ సీజన్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు (ARI) సర్వసాధారణమని, జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం వెల్లడించింది. “ప్రస్తుతం వైరల్ మహమ్మారికి ఎటువంటి ఆధారాలు లేవు” అని రాష్ట్ర ఆరోగ్య అధికారులు చెప్పారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, 121 ఆసుపత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాటు 5,000 పడకలను సిద్ధంగా ఉంచామని మమతా ప్రభుత్వం తెలిపింది.
“గత 24 గంటల్లో, కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఐదుగురు పిల్లలు, బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఇద్దరు మరణించారు” అని ఓ అధికారి తెలిపారు. అడెనోవైరస్ లక్షణాలతో ఉన్న వారి నమూనాలను పరీక్షల కోసం పంపామని.. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్‌ఐ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వివిధ వైరస్‌ల కారణంగా ఏర్పడే ARI అనేది ఒక సాధారణ కాలానుగుణ వైరస్ అని.. ప్రభుత్వం పేర్కొంది. ARI ఇన్‌ఫెక్షన్‌ల సంఖ్య ప్రస్తుత సంవత్సరంలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే.. అడెనో వైరస్ పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీని తర్వాత ప్రభుత్వం 24×7 అత్యవసర హెల్ప్‌లైన్ — 1800-313444-222 నెంబర్లను ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్‌ఎస్ నిగమ్ డాక్టర్ బిసి రాయ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్ సైన్సెస్‌ని సందర్శించి మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. దీంతోపాటు సిసియు, జనరల్ వార్డులో పడకల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు.
0-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సంక్రమణకు ఎక్కువగా గురవుతారని.. ఈ కేసులను ఇంట్లోనే చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు. పిల్లలలో, అడెనోవైరస్ సాధారణంగా శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని పేర్కొంటున్నారు. అయితే, మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..