Adipurush: ‘ఆదిపురుష్ అద్భుతం.. చూశాక అందరూ ఆశ్చర్యపోతారు’.. ఎవరన్నారంటే..


బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిపోతుంది. రాముడిగా ప్రభాస్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఖుషి కాగా.. వీఎఫ్ఎక్స్ మార్పులు సైతం సినిమాపై హైప్ పెంచేసింది. సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్స్ తర్వాత భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అటు ఫ్యాన్స్, సినీప్రియులతోపాటు.. ప్రభాస్ చిత్రయూనిట్ సైతం క్యూరియాసిటి ఏర్పడింది. అయితే ఆదిపురుష్ అద్భుతంగా ఉందని.. తుది మెరుగులు దిద్దిన తర్వాతా సినిమా చూసి అంతా ఆశ్చర్యపోతారని అన్నారు బాలీవుడ్ హీరో శరద్ కేల్కర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆదిపురుష్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు.
“నేను డబ్బింగ్ చెప్పడంలో భాగంగా ఆదిపురుష్ సినిమా చూశాను. చాలా బాగుంది. తుది మెరుగులు దిద్దాక అందరూ ఆశ్చర్యపోతారు. సినిమాలోని కంటెంట్… దాన్ని తెరకెక్కించిన విధానం అన్నీ అద్భుతంగా ఉన్నాయి.. డబ్బింగ్ అంతా పూర్తయ్యాక ప్రభాస్ ను కలిశాను. ఆయన నన్ను ఆప్యాయంగా హత్తుకుని.. చాలా బాగా చెప్పావన్నారు. అదే నాకు ప్రభాస్ ఇచ్చిన అతిపెద్ద ప్రశంసగా భావించాను.” అంటూ చెప్పుకొచ్చారు శరద్ కేల్కర్. తెలుగు హీరోలకు హిందీలో డబ్బింగ్ చెప్పడం ద్వారా శరద్ కేల్కర్ తెలుగు ప్రేక్షకులుక సుపరిచితమయ్యారు.
శరద్ కేల్కర్ గొంతు ప్రభాస్ పాత్రకు సరిపోతుందని ముందుగా గుర్తించిన వ్యక్తి రాజమౌళి. బాహుహలి నుంచి ఆదిపురుష్ వరకు ప్రభాస్ కు హిందీలో డబ్బింగ్ చెప్పింది ఆయన. ఇక ఇటీవల విడుదలైన దసరా చిత్రంలోని నాని పాత్రకు కూడా ఆయనే వాయిస్ అందించారు. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ చిత్రం జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఇందులో కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలకపాత్రలలో నటించారు.