News
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సీజ్.. మటన్ కీమా, రోటీలే కారణం..!
హైదరాబాద్‌లో ఫేమస్ హోటల్‌లో ఒకటైన ఆల్ఫా హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉండే ఆల్పా హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం (సెప్టెంబర్ 17) రోజున సీజ్ చేశారు. అయితే.. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ ఆల్ఫా హోటల్‌ను సీజ్ చేయటానికి కారణం.. మటన్ కీమా, రోటీలే. ఆల్ఫా హోటల్‌కు నిత్యం వేల మంది కస్టమర్లు వస్తూ.. టీ దగ్గరి నుంచి బిర్యానీ వరకు తమకు నచ్చిన ఫుడ్ ఐటెంను తింటుంటారు. కాగా.. ఈ హోటల్‌లో కొందరు యువకులు మటన్ కీమా, రోటీ తిన్నారు. అనంతరం.. వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో యువకులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. హోటల్‌లో తనిఖీలు చేశారు. కాగా.. హోటల్‌లో నాణ్యత, శుభ్రత లేదని గుర్తించిన అధికారులు వెంటనే హోటల్‌ను సీజ్ చేశారు. అయితే.. అస్వస్థతకు గురైన యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఏదీ తిందామన్నా భయంతో నగరవాసులు వణికిపోతున్నారు. పాల దగ్గరి నుంచి ఐస్ క్రీం వరకు అన్నీ కల్తీ తయారవుతున్నాయి. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు అందినా.. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే వెళ్లి తనిఖీలు నిర్వహించి నివ్వెరపోయే నిజాలు బయటపెడుతున్నారు. కొందరు పాలు కల్తీ చేస్తుంటే.. మరి కొందరు ఐస్ క్రీంలు కల్తీ చేస్తున్నారు.. మరికొందరు.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఏమాత్రం నాణ్యత, శుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఈ మధ్య.. ఎంతో ఫేమస్ అయిన ఉస్మానియా బిస్కెట్లలో కూడా ఈగ వచ్చిన సందర్భాలు ఎదురయ్యాయి. అయితే.. ఆల్పా హోటల్ మీద గతంలోనూ పలు ఆరోపణలు రాగా.. అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. కాగా.. మళ్లీ ఇలాంటి సంఘటన జరగటంతో.. అధికారులు డైరెక్టుగా సీజ్ చేసేశారు.