News
సనాతన ధర్మాన్ని "ఇండియా" అంతం చేయాలనుకుంటోంది.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు ఉదయనిధిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు బీజేపీ కార్యకర్తల నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరకు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించగా.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ.. తొలిసారి బహిరంగంగా సనాతన ధర్మంపై మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష కూటమి ఇండియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశాన్ని మళ్లీ వెయ్యేళ్ల క్రితం ఉన్న బానిసత్వంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు చేశారు.మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. గురువారం ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్ష కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ముంబైలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు.. అహంకార కూటమి (ఘమండియా కూటమి )ని ఎలా నడపాలని వ్యూహాలు రచించారని మండిపడ్డారు. భారత దేశ సంస్కృతిపై దాడి చేయడం కోసం ఒక రహస్య ఎజెండాను నిర్ణయించుకున్నారని విమర్శలు గుప్పించారు. భారతీయుల సంస్కృతి, విశ్వాసాలపై దాడి చేయాలని.. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని ఆరోపణలు చేశారు.దేశ కోసం ప్రాణాలు అర్పించిన వారు, సనాతన సంస్కృతికి మధ్య సంబంధాన్ని వివరించిన ప్రధాని.. దేవి అహల్యాబాయి హోల్కర్ వంటి వారికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిన సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని అహంకార కూటమి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇచ్చిన బలంతో ఝాన్సీ లక్ష్మీబాయి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి.. ఆమె తన ఝాన్సీ రాజ్యాన్ని వదులుకోనని చెప్పినట్లు ప్రధాని గుర్తు చేశారు. మరోవైపు.. సనాతన ధర్మం తన జీవితానికి ఎంతో అవసరమని మహాత్మాగాంధీ చెప్పారని.. తాను రాముడి నుంచి స్ఫూర్తి పొందానని చెప్పినట్లు తెలిపారు. అందుకే ఆయన కన్నుమూసే సమయంలో హే రామ్ అన్నారని వెల్లడించారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ కూడా సనాతన స్ఫూర్తితో జీవించారని పేర్కొన్నారు. అందుకే వారు బ్రిటీష్ పాలకుల చేత ఉరితీయబడిన సమయంలో మళ్లీ భారత మాతలో పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పడానికి సనాతన ధర్మమే వారికి ప్రేరణను ఇచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.Read More And