News

శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం.. ఆలయ సమీపంలో చక్కర్లు!శ్రీశైల మహాక్షేత్రంలో మరోసారి డ్రోన్ కలకలంరేపింది. బుధవారం ఆలయానికి సమీపంలో రాత్రి సమయంలో డ్రోన్‌ ఎగిరింది. టోల్‌గేటు వైపు నుంచి మల్లమ్మ కన్నీరు, సిద్ధరామప్ప కొలను ప్రదేశాల్లో చక్కర్లు కొట్టింది. క్షేత్ర పరిధిలోని విల్టర్‌ హౌస్‌, మల్లమ్మ కన్నీరు, రుద్ర పార్కు తదితర ప్రదేశాల్లో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్రోన్‌ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌‌కు సమాచారం అందడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి డ్రోన్‌ సంచరిస్తున్న ప్రదేశాలను తనిఖీ చేయించారు. అలాగే డ్రోన్ చక్కర్లు కొట్టడంతో తనిఖీల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న వ్యక్తులను ఆరా తీశారు. ఎక్కడి నుంచి డ్రోన్‌ ఆపరేట్‌ చేస్తున్నారనే కోణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గతంలో కూడా క్షేత్ర పరిధిలో పలుమార్లు డ్రోన్‌ సంచారం కలకలం రేపింది. మరోసారి డ్రోన్‌ చక్కర్లు కొట్టడంతో క్షేత్ర భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర పరిధిలో రాత్రి సమయంలో డ్రోన్‌ చక్కర్లు కొట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ ఎగిరింది. ఈసారి కమ్మ సత్రం, ఆర్టీసీ బస్టాండ్, బలిజ సత్రం ఆలయ పరిసరాలలో ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. వెంటనే డ్రోన్‌ను గమనించిన స్థానికులు గమనించి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఈ డ్రోన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాంటి సమాచారం మాత్రం దొరకలేదు.మరోవైపు 2021 జులైలో కూడా ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ ఎగిరింది. వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. ఆ సమయంలో డ్రోన్ వ్యవహారంపై ఏకంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు.. స్పెషల్ టీమ్‌లతో గాలించినా లాభం లేకుండా పోయింది. 2021 డిసెంబర్‌లో కూడా డ్రోన్ ఎగిరింది. అప్పుడు ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణి దగ్గర డ్రోన్‌ను గుర్తించారు. ఆలయ భద్రత సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా నాలుగైదు సార్లు డ్రోన్ ఆలయ సమీపంలో కనిపించడంపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూాడా రాత్రి సమయంలో ఈ డ్రోన్‌లు ఆకాశాంలో ఎగరడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది డ్రోన్ వ్యవహారంపై ఆరా తీసినా లాభం లేకుండా పోయింది. ఇలా తరచూ ఆలయ సమీపంలో ఇలా డ్రోన్ ఎగరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Articles

Back to top button